అదిలాబాద్, సెప్టెంబర్ 11,
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కేసీఆర్ కు, ప్రభుత్వానికి ఇబ్బందులను తీసుకువచ్చే అవకాశాలున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు పొరల్లోకి వెళ్లి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశానికి వెలుగు చూపిస్తున్న సింగరేణి కార్మికులకు కార్మిక బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని పలువురు సింగరేణి కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో మరోసారి ఆందోళనలు జరగనున్నాయంటే అవుననే వాదనలు కార్మికుల నుండి వినిపిస్తున్నాయి. ఓవైపు వారసత్వ ఉద్యోగాలు.. మరోవైపు కార్మిక బంధు పథకం ఇప్పుడు సింగరేణిలో చర్చనీయాంశంగా మారింది.సింగరేణిలో 61 సంవత్సరాల కార్మికుల వయోపరిమితి వయసును పెంచి మళ్లీ సంవత్సరం విధుల్లోకి తీసుకున్న సింగరేణి కార్మికుల వారసులకు వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని పలువురు సింగరేణి వారసుల కుమారులు ఆందోళనలు నిర్వహిస్తుంటే.. మరోవైపు సింగరేణిలో కార్మిక బందును ప్రకటించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమకు మెడికల్ బోర్డు అవకాశం కల్పించాలని శ్రీరాంపూర్ సీఎం కార్యాలయం ముందు కార్మికుల కుమారులు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి దళిత బందు లాగానే ప్రకటించాలని ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో రానున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియక ఎవరికి వారు బొగ్గు బావుల మీద కార్మికులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాలు నిత్యం కార్మికులతో సమావేశాలను నిర్వహిస్తూ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో గుర్తింపు సంఘం విఫలమైందని పలు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.సింగరేణి ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు బొగ్గు బావుల మీద గేట్ మీటింగ్ సమావేశాలను నిర్వహిస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ పై తమదైన శైలిలో పలు విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అన్ని కార్మిక సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్న టీబీజీకేఎస్ నాయకులు ఎటువంటి సమావేశాలను బొగ్గు బావులు మీద నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా కార్మిక బంధు పథకం పెట్టాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం వయోపరిమితిని పెంచిన సందర్భంగా మళ్లీ విధుల్లోకి చేరిన కార్మికులకు వారసత్వ ఉద్యోగాల అవకాశానికి మెడికల్ బోర్డుకు అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
అయితే రానున్న సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరో 17 నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలలో ప్రభుత్వానికి సవాల్ గా మారనున్నాయి. ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుందో సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు విఫలమయ్యారని పలు కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు కార్మిక సంఘాలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కార్మికులకు తెలియజేస్తూ ఎన్నికల వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కార్మికులతో సమావేశాలు నిర్వహించేందుకు పలు కార్మిక సంఘాలు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న కార్మిక బంధు పథకంతో పాటు మళ్లీ సంవత్సరం పాటు ఉద్యోగంలో చేరిన సింగరేణి కార్మికుల కుమారులకు వారసత్వ ఉద్యోగాలపై మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఏటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.