ఆలయ దర్శనం సమయం: ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద ఉన్న కర్ణి మాత ఆలయం ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. ఇవి ఆలయ ప్రాంగణంలోనే తింటాయి, అక్కడే నివసిస్తాయి. ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు. ఈ పవిత్ర ప్రాణులను 'కబ్బాస్' అని కూడా పిలుస్తారు. వీటిని దర్శించుకుని తమ భక్తిని చాటుకునేందుకు దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఈ ఆలయంలో తలుపు హ్యాండిల్స్ నుండి గ్రిల్స్, పాలరాయి నిర్మాణాల వైపు ఉన్న అంచుల వరకు కూడా ఎలుకలు కచ్చితంగా ప్రతి చోటా ఉంటాయి. ఆలయంలో చెల్లా చెదురుగా ఉన్న పాలు, కొబ్బరి చిప్పలు, అనేక ఇతర ఆహార పదార్ధాల చుట్టూ ఇవి డజన్ల కొద్దీ కనిపిస్తాయి. ఈ ఎలుకలు మీ కాళ్ల క్రింద పడకుండా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల ఎలుకలు ఈ ఆలయంలో ఉన్నాయి. భక్తులు, ఆలయ నిర్వాహకులు వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆలయంలో నడుస్తున్నప్పుడు పొరపాటున ఒక ఎలుక మీ కాళ్ల కింద నలిగి మరణిస్తే ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా? పొరపాటున ఏదైనా ఎలుక కాళ్ల క్రింద పడి మరణిస్తే అపవిత్రతకు కారణమైన వ్యక్తి ఆ ఎలుక విగ్రహాన్ని ఘన బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు. ఇతర జంతువులు, పక్షుల నుండి ఎలుకలను సురక్షితంగా ఉంచడానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు మరియు గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో కుటుంబాలతో శాశ్వతంగా నివసించే పూజారులు మరియు సంరక్షులు ఉన్నారు. వీరు ఎలుకలకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి విసర్జనను కూడా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేస్తుంటారు. అసలు కధ ఏమిటంటే శక్తికి, విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలు కర్ణి మాత. 14వ శతాబ్ధం కాలం నాటి ఈమె దాదాపు 150 సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు. కర్ణి మాతకు చిన్న తనం నుండి ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది. దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు. ఓ రోజు అకస్మాత్తుగా కర్ణి మాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించే పూజలు చేయడం ప్రారంభించారు. తరవాత కర్ణి మాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని సేవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నట్లు చెబుతారు. కర్ణిమాత ఆలయంలో దాదాపు అన్నీ నల్ల ఎలుకలే భక్తులకు కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడు కొందరికి ఇక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తుంటాయి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. కర్ణిమాత ముగ్గురు పిల్లలు పురిట్లోనే మరణిస్తారు. దీంతో ఆమె భర్తకు సొంత చెల్లెలిని ఇచ్చి వివాహం చేస్తుంది. వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఓ సారి ఆ బాలుడు ఆడుకుంటూ కపిల్ సరోవర్ లో పడి చనిపోతాడు. దీంతో కర్ణిమాత ఆ బిడ్డను బ్రతికించాలని యముడిని వేడుకుంది. యముడు కరగకపోవడంతో ఆమె దుర్గాదేవిని ప్రార్ధించి అమ్మవారి అనుగ్రహంతో కుమారుడి ప్రాణం పోస్తుంది. ఆ కుమారుడితో పాటు కర్ణిమాత పురిట్లో మరణించిన ముగ్గురు పిల్లలు కూడా బ్రతుకుతారు. ఆ నలుగురు తెల్ల ఎలుకల రూపంలో ఇప్పటికీ ఆలయంలో తిరుగుతుంటారని, వీటిని దర్శించిన వారిని కర్ణిమాత అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ తెల్ల ఎలుకలు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే కనిపిస్తాయి.
ఎలా చేరుకోవాలి?
బికనేర్ చేరుకోవడానికి సమీప విమానాశ్రయం జోధ్ పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది సుమారు 251 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబై, జైపూర్, చెన్నై, అహ్మదాబాద్ వంటి అన్ని ప్రధాన నగరాల నుండి బికనేర్ కు ప్రజా రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు. లాల్ భాగ్ జంక్షన్ (ఎల్జీహెచ్), బికనేర్ జంక్షన్ (బికెఎన్) నగరంలోని రెండు రైల్వే జంక్షన్లు. కర్ణిమాత ఆలయానికి ఏడాది పొడవునా వేలాది మంది పర్యాటకులు, భక్తులు వస్తారు. ఈ ఆలయం బికనేర్ జంక్షన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సర్వేజనా సుఖినోభవంతు!