విజయవాడ, సెప్టెంబర్ 13,
క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ళు గాడి తప్పేస్తున్నారు. అధిష్టానానికి ఒక్కో చోటా ఒక్కోలా చుక్కలు చూపించేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో కొవ్వూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ గత ఎన్నికలకు ముందు వరకు టిడిపి బలంగా ఉండేది. మాజీ మంత్రి కె ఎస్ జవహర్ పాతుకుపోయారని ఆ పార్టీ లెక్కేస్తే పార్టీలోని మరోవర్గం ఆయన్ను మార్చకపోతే ఇంతే సంగతులని హెచ్చరించాయి.సరే వారి అభ్యర్ధనను మన్నించి జవహర్ సిట్టింగ్ సీటు ను కృష్ణా జిల్లా తిరువూరు కి మార్చేశారు చంద్రబాబు. పాయకరావు పేట నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలిసిన వంగలపూడి అనిత ను కొవ్వూరు నుంచి రంగంలోకి తెచ్చారు. తిరువురు లో జవహర్ వైసిపి అభ్యర్థి రక్షణ నిధి పై పరాజయం చెందితే కొవ్వూరు లో అనిత ఓడిపోయారు. దాంతో ఇద్దరు ఎవరి నియోజకవర్గాలకు వారు వెనక్కి వచ్చేశారు. ప్రస్తుతం జవహర్ రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో పార్టీకి ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే తన నియోజకవర్గానికి తిరిగి వచ్చినా కె ఎస్ జవహర్ వ్యతిరేకవర్గం మాత్రం గతంలోలాగే ఆయన్ను లెక్క చేయడం లేదు. వైసిపి నుంచి ఇక్కడ నుంచి గెలిచిన తానేటి వనిత ను జగన్ మంత్రి గా చేశారు. ఆమె తనదైన శైలిలో ఒకవైపు దూసుకుపోతుంటే జవహర్ రీ ఎంట్రీ ఇచ్చినా పార్టీని గాడిన పెట్టలేక పోతున్నారు. కొవ్వూరు రాజకీయాలను గతంలో శాసించిన కృష్ణ బాబు వంటివారు లేని లోటు టిడిపి అధిష్టానానికి కష్టాలు పెంచింది. తన సొంత నియోజకవర్గంలో పార్టీని గాడిన పెట్టలేకపోతున్న జవహర్ కి పార్లమెంటరీ పరిధి బాధ్యతలు కూడా అప్పగించడం గమనిస్తే సైకిల్ పార్టీలో బలమైన నేతలు లేని లోటు స్పష్టం అవుతుంది. మరి దీన్ని బాబు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.