YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అక్క‌ర‌కు వ‌స్తున్న ఈ ఫిష్ యాప్

అక్క‌ర‌కు వ‌స్తున్న ఈ ఫిష్ యాప్

కాకినాడ‌‌, సెప్టెంబ‌ర్ 13, 
రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య దిగుబడులను, సాగు విస్తీర్ణాన్ని 2025 నాటికి మూడింతలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాంకేతిక విధానాల అమలు ద్వారా కలగనున్న ప్రయోజనాలపై రైతులకు అవగాహన కలిగిస్తూ.. ఆ విధానాల అమలుకు ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ద్వారా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులన్నింటినీ క్షణాల్లో ప్రభుత్వానికి తెలిసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రస్తుత కోవిడ్‌–19 వంటి విపత్తులో ఆక్వా రైతులకు ఈ యాప్‌ల ద్వారా సత్వరం సేవలు అందుబాటులోకి వస్తాయి.  వ్యవసాయ శాఖలోని ఈ–కర్షక్‌ విధానాన్ని పరిశీలించి మత్స్యశాఖ అధికారులు ఈ–ఫిష్‌ యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 1.95 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యలు సాగులో ఉన్నాయి. అయితే గ్రామ, మండల, జిల్లాల వారీగా పంటల వివరాలు నేటికీ లేవు. ఇప్పుడు సర్వే నంబర్లు, రైతుల పేర్లు, సాగులోని వివరాలను యాప్‌ ద్వారా నమోదు చేస్తూ డాష్‌ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. తద్వారా నష్టపోయినప్పుడు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే అందించవచ్చు.  వ్యవసాయ శాఖలోని పొలంబడిని ఆధారంగా చేసుకుని మత్స్య సాగుబడి యాప్‌ను రూపొందించారు. సాగులో మెళకువలు, అధిక దిగుబడుల కోసం మేత వినియోగం తదితర విషయాల్లో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి ఆర్‌బీకేలో మత్స్య సాగుబడిని ఏర్పాటు చేసి, రైతుల సందేహాలు నివృత్తి చేస్తారు.   ఐదు హెక్టార్లలోపు చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద చెరువులు ఉన్న రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తారు. సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిండానికి చర్యలు  తీసుకుంటున్నారు. రైతుల వివరాలు యాప్‌ ద్వారా నమోదు చేసి డాష్‌బోర్డు ద్వారా మత్స్యశాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఆక్వా రైతుల పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌బీసీ (స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ)లో ప్రభుత్వానికి వివరించడానికి అవకాశం ఉంటుంది.   ప్రభుత్వం రాష్ట్ర మత్స్య సహాయకులకు ఇచ్చిన టెస్ట్‌ కిట్‌ల ద్వారా చెరువుల్లోని నీటి నాణ్యతను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. రొయ్యలు, చేపల మేత, రోగనిరోధక మందుల వినియోగానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆక్వాల్యాబ్స్‌కు వీటిని అనుసంధానం చేస్తారు.

Related Posts