YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బలపడుతున్న బొత్స

 బలపడుతున్న బొత్స

విజయనగరం, సెప్టెంబర్ 13, 
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన ఆయనకు ఈ మూడు జిల్లాల్లో మంచి పలుకుబడి ఉంది. బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆయన కూడా కీలకమైన మంత్రిత్వ శాఖకు నిర్వహిస్తారు. బొత్సకు ఉన్న సీనియారిటీ, ప్రాంతం, ఇతర నేపధ్యాలు అన్నీ కలసి ఆయనను అయిదేళ్ల మంత్రిగా జగన్ క్యాబినేట్లో ఉంచుతాయని అంటున్నారు. జగన్ మార్కు రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నా కూడా బొత్స సత్యనారాయణను మార్చే పరిస్థితి రాదు అని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే బొత్స సత్యనారాయణకు అదే పార్టీలో ప్రత్యర్ధిగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఆయన మంత్రి పదవి మీద పెద్దాశనే పెట్టుకున్నారు. కోలగట్ల వైసీపీలోకి తొలిగా వచ్చి చేరిన నాయకుడు. ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం ఆయన వైఎస్సార్, జగన్ లకు ఇష్టుడు అయినా కూడా రాజకీయంగా అనుకున్న స్థానానికి చేరలేకపోయారు. ఈసారి కూడా మంత్రి పదవి దక్కకపోతే కోలగట్ల రాజకీయం ముగిసినట్లే అంటున్నారు. అయితే లెక్కలు మాత్రం ఆయనకు కుర్చీ అప్పగించేందుకు అనుకూలంగా లేవు అంటున్నారు. ఇక కోలగ‌ట్లకు మంత్రి పదవి దక్కదని జగన్ సూచనాప్రాయంగా చెప్పేశారా అన్న టాక్ కూడా ఉంది. ఆయన కుమార్తె, రాజకీయ వారసురాలు అయిన శ్రావణిని విజయనగరం కార్పోరేషన్ డిప్యూటీ చైర్ పర్సన్ గా ఈ మధ్యనే నియమించడం ద్వారా ఇక ఆ కుటుంబానికి న్యాయం చేశామని హై కమాండ్ భావిస్తోందిట. రేపటి రోజున విస్తరణ చేపట్టినా కోలగట్లకు చాన్స్ ఇవ్వలేమని చెప్పడానికే ముందర కాళ్ళకు అలా బంధాలు వేశారని అంటున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ వర్గంలో మరింత ధైర్యం పెరిగింది అంటున్నారు. మరో వైపు చూసుకుంటే 2024 ఎన్నికలు వైసీపీకి చాలా ముఖ్యం. అందునా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఎక్కువ సీట్లు మరోసారి గెలుచుకుంటేనే అధికారం దక్కుతుంది. దాంతో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. అదే విధంగా విశాఖను రాజధానిగా చేస్తే సీనియర్ గా బొత్స లాంటి వారు చేదోడు వాదోడుగా ఉండాలి అన్నది కూడా వైసీపీ పెద్దల దూరాలోచనగా కనిపిస్తోందిట. ఏపీలో సామాజిక సమీకరణలు మారుతున్న నేపధ్యంలో తూర్పు కాపుల మద్దతు విశేషంగా ఉన్న బొత్స సత్యనారాయణను జగన్ తప్పించే సాహసం చేయరని కూడా మాట వినిపిస్తోంది.

Related Posts