YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ముందుకు సాగని బందరు పోర్టు

ముందుకు సాగని బందరు పోర్టు

విజయవాడ, సెప్టెంబర్ 13, 
కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడే బందరుపోర్టు నిర్మాణం కోసం జిల్లా ప్రజలు సుదీర్ఘకాలం అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తాము అధికారంలోకి వస్తే ఆరునెలల్లోనే బందరు పోర్టు నిర్మాణం చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి రెండేళ్లయినా ఆ దిశగా అడుగులుపడలేదు. టెండర్‌ దశ దాటలేదు. దీంతో పోర్టు నిర్మాణంపై గత ప్రభుత్వాలులాగానే వైసిపి ప్రభుత్వం మాటల గారడీ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా ప్రజల చిరకాల వాంఛ, పారిశ్రామిక పురోగతికి దోహదపడే మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తీవ్ర తాత్సారం జరుగుతోంది. 2008 లో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా ఇప్పటికీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి ఏడున పోర్టు నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బిఒటి) పద్ధతిలో భాగస్వామ్య సంస్థగా ఉన్న నవయుగ సంస్థ దీని నిర్మాణ పనులకు అవసరమైన భారీ యంత్రాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2019 ఆగస్టులో నవయుగ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించింది. అనంతరం రైట్స్‌ సంస్థ మొదటి దశలో పోర్టు నిర్మాణానికి రూ.5,700 కోట్ల అంచనాతో రూపొందించిన నూతన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌) ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ.1000 కోట్లు ఫైనాన్షియల్‌ అసిస్టెన్సీ ఇచ్చింది. ఇది జరిగి ఐదు నెలలైనా నూతనంగా ఆమోదించిన డిపిఆర్‌ కు అనుగుణంగా ఎలాంటి కార్యాచరణ ప్రారంభం కాలేదు. ఎపి మారిటైం బోర్డు టెండర్లు ఆహ్వానించినా మొదటి దశలో జులై 6వ తేదీనాటికి కాంట్రాక్టర్లెవరూ టెండరు దాఖలుకు ముందుకు రాలేదు. దీంతో కాంట్రాక్టు నిబంధనల్లో మార్పులు చేసి తిరిగి ఆహ్వానించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కాంట్రాక్టు ఒప్పందం పూర్తి కాలేదు.పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రైలుమార్గం, జాతీయ రహదారులతో పోర్టు కనెక్టివిటీకి అవసరమైన భూములు సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఈ నిధులు విడుదల కాలేదు. రైలు, రోడ్డు మార్గాల కనెక్టివిటీ అవసరమైన భూ సేకరణ నిలిచిపోయింది.2008 ఏప్రిల్‌ 23 న బందరు పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. సముద్ర ముఖ ద్వారానికి దగ్గరలో ఉన్న 6,262 ఎకరాల ప్రభుత్వ భూమిలో పోర్టు నిర్మిస్తామని, రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో మైటాస్‌ మాతృసంస్థ సత్యం కంప్యూటర్స్‌ ఆర్థిక లావాదేవీల్లో పీకల్లోతు కూరుకుపోయింది. దీని ఫలితంగా మైటాస్‌ సంస్థ బాధ్యతల నుంచి వైదొలిగింది. తదుపరి నిర్మాణ బాధ్యతలను నవయుగ కంపెనీ భుజాన వేసుకుంది. అప్పటి నుంచి భూముల విషయంలో నాటకీయ పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత 2012 మే 2 న ప్రజాపధంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉన్నామని, పోర్టు కోసం 4,800 ఎకరాలు, పోర్టుల శాఖకు 524 ఎకరాలు కలిపి 5,324 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రకటించారు. భూసేకరణకు సంబంధించిన జిఒ 11ను ప్రజల సమక్షంలోనే వేదికపైనే అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం జరిగిపోయాయి. ఐదేళ్లపాటు పట్టించుకోకుండా ఎన్నికలకు మరో నెలరోజులు సమయం ఉన్న సమయంలో చంద్రబాబు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది. అయితే రెండేళ్లన్నరేళ్లయినా బందరు పోర్టు నిర్మాణంపై నీలినీడలు తొలగిపోలేదు. పోర్టు కల సాకారమవ్వాలంటే ఇంకెంతకాలం వేచిచూడాలన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

Related Posts