లక్నో, సెప్టెంబర్ 13,
ఇప్పుడు దేశంలో అందరి కళ్లు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపైనే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? లేదా? అన్న చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే మరోసారి ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్నట్లే. అయితే ఇప్పటికీ మోదీ ఏం నిర్ణయాలు తీసుకున్నా ఆయనపై ఉన్న వ్యతిరేకత కన్నా విపక్షాలపై నమ్మకం లేకపోవడం ఎక్కువగా కన్పిస్తుంది. ఈ కారణంగానే మోదీకి ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి విజయం తప్పదు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఏబీపీ ఉత్తర్ ప్రదేశ్ లో సర్వే నిర్వహించింది. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం విశేషం 485 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో ఏబీపీ సర్వే ప్రకారం 42 శాతం మంది ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా 267 స్థానాలను గెలుచుకునే అవకాశముంది.ఉత్తర్ ప్రదేశ్ స్థానాల సంఖ్యను బట్టి చూస్తే అధికారంలోకి రావాలంటే 248 స్థానాలను గెలుచుకోవాలి. మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించే అవకాశం బీజేపీకే ఉందని ఏబీపీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పెద్దగా పుంజుకోలేదన్నది ఈ సర్వే ఫలితాలను బట్టి తేలింది. సమాజ్ వాదీ పార్టీకి 30 శాతం మంది ప్రజలు మొగ్గు చూపారు. అంటే ఎస్పీ 117 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది.ఇక ఉత్తర్ ప్రదేశ్ లో ప్రభావం చూపుతుందనుకున్న మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీని ప్రజలు పెద్దగా ఆలోచించడం లేదని ఏబీపీ సర్వే తేల్చింది. కేవలం 16 శాతం ఓట్లను మాత్రమే రాబట్టుకునే వీలుంది. దీన్నిబట్టి బీఎస్పీకి 16 స్థానాలు మాత్రమే వస్తాయని తేల్చింది. ఇక మరోజాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించడం లేదు. కేవలం ఐదు శాతం ఓట్లతో ఏడు స్థానాలకే పరమితమయ్యే అవకాశముంది. దీన్ని బట్టి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా బీజేపీని అధికారానికి దూరం చేయలేవన్నది స్పష్టమయింది.