‘మాస్ట్రో’లో ఫస్ట్ షాట్ నుండి నితిన్ తన క్యారెక్టర్‌లో లీనమై చేశారు - డైరెక్టర్ మేర్లపాక గాంధీ
నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. నభ నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ 'అందాధున్' సినిమా చూశా. 'అందాధున్' చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా నచ్చాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. నితిన్ గారు, సుధాకర్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో ఈ సినిమా చేసాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లోని లవ్ స్టోరీలో, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసాం.
బేసిక్‌గా రీమేక్ సినిమా చేయడం కొంచెం కష్టం. ఉన్నది ఉన్నట్లుగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు. ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. ఆ సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది. అందుకే ఒరిజినల్ వర్షన్‌లో ఆ ఫీల్ మిస్ కాకూడదని ఉన్న కొన్ని ఫ్రేమ్స్ ఉన్నవి ఉన్నట్లుగా చేశాం.
చిత్రంలో అంధుడిగా నితిన్ బాగా చేశారు. కోవిడ్ సంబంధిత కొన్ని కారణాల వల్ల ప్రారంభంలోనే దుబాయ్ షెడ్యూల్ చేసి క్లైమాక్స్ షూట్ చేసాం. ఫస్ట్ షాట్‌లోనే అంధుడిగా ఆ క్యారెక్టర్‌లో లీనమై చేశారు నితిన్. దీంతో ఈ సినిమా చేసేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. టబు చేసిన పాత్రలో తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. టబు ఏజ్ గ్రూప్ కాకుండా కొద్దిగా యంగ్‌గా వెళదామని ఇలా ప్లాన్ చేశాం. ఆమె కమర్షియల్ హీరోయిన్ కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. తమన్నా యాక్ట్ చేస్తుంటే చూసి నేనే షాకయ్యా.
హర్ష డాక్టర్ క్యారెక్టర్ బాగా చేశారు. సింగర్ మంగ్లీతో సీన్స్ బాగా వచ్చాయి. అలాగే రచ్చ రవి, సీనియర్ యాక్టర్ నరేష్ గారు, నభా నటేష్ అందరూ చాలా బాగా నటించారు. మొదట ఈ సినిమాను జులై 11న రిలీజ్ ప్లాన్ చేసాం. కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో బాగా ఆలోచించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రూరల్ రీచ్ కాలేదు. చూడాలి మరి రీమేక్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది.
మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలు చాలా కొత్తగా ట్రై చేశారు. సాంగ్ చిత్రీకరణ కోసం కొత్త అటెంప్ట్ చేసాం. బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్స్ పెట్టి వర్చువల్ రియాలిటీలో షూట్ చేశాం. మాస్ట్రో అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా టైటిల్ అనుకున్నాం కానీ చివరకు ఈ టైటిల్ ఫిక్స్ చేశాం. రీమేక్ సినిమాలు చేస్తుంటే కంపారిజన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యూచర్‌లో నితిన్‌తో స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా.
ఒక స్క్రిప్ట్ అనుకొని కొన్ని నెలలు ట్రావెల్ చేసి తర్వాత డ్రాప్ చేస్తుండటం వల్ల సినిమాలు రూపొందించడంలో కాస్త లేట్ అవుతోంది. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి త్వరలోనే చెబుతా. మా నాన్న రొమాంటిక్ నావెల్స్ రాస్తుంటారు. నాకేమో అది నచ్చదు. మేమిద్దరం బాగా ఫైట్ చేసుకుంటాం. ఇంట్లో రైటర్స్ ఉంటే అదే ప్రాబ్లమ్. 42 రోజుల్లో ఈ 'మాస్ట్రో' సినిమా కంప్లీట్ చేసాం. రాయడమే లేటుగానీ తీయడం ఫాస్ట్‌గా తీస్తా. సోషల్ మీడియా బాగా ఫాలో అవుతూ ఏ ఫన్ అక్కడ వర్కవుట్ అవుతోందో పక్కాగా ప్లాన్ చేసుకుంటా.