నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలి
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై సెప్టెంబర్ 13
నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు. ఇవాళ నేను నీట్ కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాను. మీరు కూడా గతంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుకే ఈ తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా ప్రతిపక్షాన్ని కోరుతున్నాను అని ఈ సందర్భంగా స్టాలిన్ అన్నారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.అయితే తమిళనాడులో నీట్ జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. నీట్ పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని విమర్శించారు. నీట్ ను రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం. అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నాం అని పళనిస్వామి అన్నారు. నీట్ కు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి.. పరీక్షకు కొన్ని గంటల ముందు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.