ఇండియా ఇంగ్లండ్ మ్యాచ్ పై రగడ
ముంబై, సెప్టెంబర్ 13,
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ కరోనాతో రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భారత్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫ్రాంఛైజీలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించారు. అయితే, ఇంగ్లండ్ బోర్డు కూడా భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ వచ్చే నెలలో ప్రారంభమయ్యేలోపు పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఇటు బీసీసీఐని, అలు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అయిందంట. ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక ప్రకారం, టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ప్లేఆఫ్‌లో ఆడలేరు.మాంచెస్టర్ టెస్టును రద్దు చేసిన తర్వాత ఇంగ్లండ్ బోర్డు భారత్‌పై రెండో గూగ్లీని సంధించింది. ఇప్పటికే ఐసీసీకి ఐదో టెస్ట్ ఫలితం తేల్చాలంటూ లేఖ రాయగా, మరోసారి భారత్‌ను దెబ్బతీసేందుకు పాకిస్థాన్‌తో పొట్టి సిరీస్‌కు సిద్ధమైంది. నివేదికల ప్రకారం, ఇంగ్లండ్ టీం మేనేజ్‌మెంట్ టీ 20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరూ పాకిస్థాన్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో పాల్గొనాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇయాన్ మోర్గాన్, మోయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, క్రిస్ వోక్స్, టామ్ కర్రాన్ వంటి వారు ఐపీఎల్ 2021 ప్లేఆఫ్‌లో ఆడటానికి అందుబాటులో ఉండరు.
పాకిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమైన ఇంగ్లండ్ బోర్డు!
ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ పాకిస్థాన్‌లో జరగబోయే టీ 20 సిరీస్‌ను పొట్టి వరల్డ్ కప్ కోసం చివరి సన్నాహంగా మార్చుకోవాలని చూస్తోంది. టీ 20 వరల్డ్ కప్ యూఏఈలో జరగనుంది. ఐసీసీ ఈవెంట్‌కు ఎంపికైన ఆటగాళ్లందరూ పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో భాగంగా ఉండాలని ఇంగ్లండ్ బోర్డు ఆదేశాలు జారీ చేసంది. దీంతో ఐపీఎల్‌లో ఆడే ఇంగ్లండ్ ప్లేయర్లు ప్లేఆఫ్ మ్యాచ్‌లను వదిలివేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 9 న పాకిస్థాన్ వెళ్లనున ఇంగ్లండ్..
ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 9 న పాకిస్తాన్ చేరుకోవాలి. అదే సమయంలో, ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతాయి. యూఏఈలో ఇంగ్లండ్ జట్టు 2 వార్మప్ మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇందులో కూడా తన ఆటగాళ్లందరూ ఉండాలని ఈసీబీ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంగ్లండ్ టీం పాకిస్థాన్‌తో జతకట్టేందుకు సిద్ధమైంది.