YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆగని రైతుల పోరాటం...

ఆగని రైతుల  పోరాటం...

విజయవాడ, సెప్టెంబర్ 14, 
అమరావతి. ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన నగరం. నిలుస్తుందని అనుకున్న పట్టణం. కానీ.. రాజకీయాల్లో చిక్కుకుని.. భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న నగరం. ఇందులో.. ఎవరినీ తప్పుబట్టడం కానీ.. మంచి అనడం కానీ.. ఎంత మాత్రం లేదు. కానీ.. లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియక.. నిత్యం అక్కడ దీక్షల పేరుతో పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతుల భవిష్యత్తు ఏంటి.. అన్నదే ఇక్కడ చర్చనీయాంశం.గతంలో టీడీపీ ఉన్నప్పుడు భూములు సేకరించింది. అమరావతిపై ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రచారం చేసింది. దేశానికే మహా నగరం కానుందని విశ్వాసాన్ని కల్పించింది. తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సహజంగానే.. పాలనలో నిర్ణయాలు, ప్రాధాన్యాలు మారుతాయి. ఈ ప్రభావం.. అమరావతిపైనా పడింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అందులో అమరావతి సైతం ఉంది.అప్పటి నుంచి నేటి వరకూ.. 636 రోజులుగా ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ప్రముఖులు సైతం వారికి మద్దతు తెలియజేస్తున్నారు. మరోవైపు.. 3 రాజధానుల ప్రతిపాదననూ సమర్థించేవాళ్లు చాలా మంది ఉన్నారు. రైతుల దీక్షలకు పోటీగా.. 3 రాజధానులను సమర్థిస్తూ దీక్షలు చేసినవాళ్లూ ఉన్నారు. అంతా బానే ఉంది. కానీ.. ఇలా దీక్షలు ఎన్నాళ్లు చేస్తారు.. ఎప్పటికి.. మధ్యే మార్గ నిర్ణయం వస్తుంది.. అన్నదే అస్పష్టంగా ఉంది.రైతులు కాయాకష్టం చేస్తే తప్ప పంటలు పండవు. అలాంటివాళ్లు ఇలా ఇల్లూవాకిలీ వదిలి.. పోరాడుతున్న తీరుకు.. ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఫుల్ స్టాప్ పెట్టగలిగే పరిష్కారాన్ని చూపించాలి. ఇది రాజకీయంగా కూడా ప్రభావితం చూపడం లేదన్నది.. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది. ఈ వాస్తవాన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సిన అత్యవసరం ఉంది.అన్ని పార్టీల నాయకులూ కలిసి ఓ వేదికను ఏర్పాటు చేసి.. రైతులకు భరోసా కల్పించాల్సిన తక్షణ అవసరం కనిపిస్తోంది. వారి ఆవేదనకు తగిన పరిష్కారం చూపించాల్సిన అవసరం సైతం ఉంది. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారో.. ఎప్పుడు సమస్య పరిష్కారమవుతుందో… అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి

Related Posts