YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొడాలికి తప్పని ఇంటిపోరు...

కొడాలికి తప్పని ఇంటిపోరు...

విజయవాడ, సెప్టెంబర్ 14, 
ఏపీ మంత్రి వైసీపీ ఫైర్‌బ్రాండ్ నేత కొడాలి నానికి ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్‌లోనే ఎప్పుడూ ఎదుర్కోనంత క‌ష్టం గుడివాడ‌లో వ‌చ్చిప‌డింది. 2004లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ప్రతిప‌క్షంలో ఉన్నారు. 2009లో ఆయ‌న మ‌రోసారి టీడీపీ నుంచే విజ‌యం సాధించ‌గా.. అప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో అప్పుడు కూడా ఆయ‌న‌ది ప్రతిప‌క్ష పాత్రే అయ్యింది. కొడాలి నాని తొలి ఎన్నిక‌ల్లో 7 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధిస్తే రెండోసారి ఆయ‌న ఏకంగా 17 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఓవ‌రాల్‌గా 2009 ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లాలోనే టాప్ మెజార్టీ సాధించారు.కొడాలి నానిని రెండోసారి గెలిపించిన గుడివాడ ప్రజ‌లు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అవేవీ నెర‌వేర‌లేదు. ఇక ఆయ‌న వైపీపీలోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా 2014 ఎన్నిక‌ల్లో ఏకంగా 11 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించ‌డంతో పాటు గుడివాడ మున్సిపాల్టీపై సైతం వైసీపీ జెండా ఎగిరేలా కొడాలి నానికి వెన్నుద‌న్నుగా ఉన్నారు. బ్యాడ్‌ల‌క్ ఏంటంటే నాని 2014లో గెలిచినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో కొడాలి నాని ప్రజ‌ల‌కు మీరు నా మీద ప్రేమ‌తో న‌న్ను గెలిపించినా.. మ‌న పార్టీ అధికారంలోకి రాలేదు.. న‌న్నేం చేయ‌మంటారు ? అని ఎదురు ప్రశ్నలు వేయ‌డంతో పాటు త‌న‌పై మ‌రింత సానుభూతి పెరిగేలా చేసుకున్నారు.ఎట్టకేల‌కు కొడాలి నాని క‌ల పండ‌డంతో పాటు గుడివాడ ప్రజ‌ల కోరిక తీరింది. గ‌త ఎన్నిక‌ల్లో కొడాలి నాని వ‌రుస‌గా నాలుగోసారి విజ‌యం సాధించారు. పార్టీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న మంత్రి అయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న ప్రజ‌ల ప్రశ్నల‌కు త‌ప్పించుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఆయ‌న జ‌గ‌న్ కేబినెట్ లోనే ఓ ఫైర్ బ్రాండ్ మంత్రి. ఇర‌వై ఏళ్లుగా గెలిపిస్తూ వ‌స్తున్నా కొడాలి నానిని ఏమీ అన‌ని గుడివాడ ప్రజ‌లు ఈ సారి మాత్రం గ‌ట్టిగానే వాయించేస్తున్నారు. కొడాలి నాని మంత్రిగా ఉన్నా గుడివాడ‌లో అభివృద్ధి జ‌ల‌గ సాగుడును త‌ల‌పిస్తోంది. గుడివాడ కొత్త బ‌స్టాండ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైన అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియ‌దు. ఇక గుడివాడ‌ను ప్రధాన న‌గ‌రాల‌తో క‌నెక్ట్ చేసే అన్ని ప్రధాన ర‌హ‌దారులు ఘోరంగా ఉన్నాయి. విజ‌య‌వాడ – గుడివాడ‌, గుడివాడ – హ‌నుమాన్ జంక్షన్ ర‌హ‌దారుల ప‌రిస్థితి మ‌రీ ఘోరం.ఇక నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల కేంద్రాల‌తో పాటు అన్ని ప్రధాన ర‌హ‌దారుల ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. ఇక కొడాలి నాని గుడివాడ ప్రజ‌లు గుర్తుంచుకునే ఒక్కటంటే ఒక్క ప‌ని కూడా చేయ‌లేద‌న్న విమ‌ర్శలు తీవ్రంగా వ‌స్తున్నాయి. కేవ‌లం టీడీపీని, చంద్రబాబును తిట్టడంలో దూకుడు చూపిస్తే స‌రిపోద‌ని.. ఇర‌వై ఏళ్లుగా ఓట‌మి లేకుండా నెత్తిన పెట్టుకుంటోన్న గుడివాడ ప్రజ‌ల‌ను గుర్తంచుకోవాల‌న్న విమ‌ర్శలు ఇప్పుడు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కొడాలి నానిపై ఎప్పుడూ లేనంత వ్యతిరేక‌త ఇప్పుడు గుడివాడ‌లో ఉంది. అయితే దీనిని క్యాష్ చేసుకునే ద‌మ్ము టీడీపీలో ఉంటే కొడాలి నానికి నెక్ట్స్ క‌ష్టమే అన్న టాక్ వ‌చ్చేసింది.

Related Posts