హైదరాబాద్, సెప్టెంబర్ 14,
వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పటి నుంచి.. వరుసగా సభలు నిర్వహిస్తూ పోతున్నారు. రాజకీయంగా ఆమె చేస్తున్న విమర్శలు, తిరిగి ఆమెపై వస్తున్న ప్రతి విమర్శలు పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేస్తున్న అడుగులు.. ముచ్చటగా ఉన్నాయని.. న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా.. వైఎస్ జగన్ తోడబుట్టిన సోదరిగా.. ఆమె ప్రతిభ చాటుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.సాధారణంగా.. జగన్ ఏ ర్యాలీ చేసినా.. ఏ సభ నిర్వహించినా.. జన ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది. తండోపతండాలుగా జనం తరలివస్తుంటారు. ఆ దిశగా.. పార్టీ నాయకత్వం సైతం సమర్థంగా పని చేస్తుంటుంది. 2019లో జరిగిన ఎన్నికలు కావచ్చు.. అంతకు ముందు ఓదార్పు యాత్ర కావచ్చు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన దీక్షలు కావచ్చు. ఏదైనా సరే.. జనాలు మాత్రం భారీగానే తరలివచ్చేవారు. జగన్ కు సంఘీభావం తెలిపేవారు.ఈ క్రమంలో.. జగన్ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పుడు.. షర్మిల ఎంతగానో సహకరించారు. జగన్ గైర్హాజరీలో.. తానే స్వయంగా జగనన్న వదిలిన బాణంగా ముందుకు కదిలారు. ప్రజలతో మమేకమయ్యారు. అందరినీ కలుపుకొనిపోయారు. ఆ అనుభవం.. ఇప్పుడు షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లో బాగా కలిసి వస్తున్నట్టు కనిపిస్తోంది. అది… ఆమె నిర్వహించిన దళిత భేరి సభలో.. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షల్లో స్పష్టమవుతోంది.అయితే.. షర్మిల వెనక ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్త ఉన్నారని.. ఆయన దిశానిర్దేశంలోనే షర్మిల రాజీకీయాలు చేస్తున్నారని వాదించేవారు సైతం ఉన్నారు. కానీ.. తనకంటూ ఓ పొలిటికల్ గ్లామర్ లేకుండా.. వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నా.. జగన్ ఉన్నా.. మరెవరు ఉన్నా.. షర్మిల స్వయంగా ఇంత ముందుకు వెళ్లలేదని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె సభలకు చెప్పుకోదగ్గ సంఖ్యలో వస్తున్న ప్రజలే.. ఈ చర్చకు కేంద్రంగా నిలుస్తున్నారు.కరోనా పరిస్థితులు తగ్గాక.. షర్మిల సభలకు, దీక్షలకు మరింతగా జనాలు హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని.. రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.