హైద్రాబాద్, సెప్టెంబర్ 14,
గులాబీ బాస్.. హస్తినలో 10 రోజులు మకాం పెట్టేశారు.. బీజేపీ నేతలను కలిసినా... జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే యోచనలో మాత్రం ఉన్నారు. అంతకు ముందు తనకు రాజ్యసభ సీటు అడిగితే ఇందిరా గాంధీ ఇవ్వలేదని అలిగి ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చారని చెబుతారు. ఇక ఎన్టీయార్ తాను ఎమ్మెల్యేగా గెలిచి కొంతమందితో అయినా రాజకీయ ఉనికి చాటుకుందామనుకుని రంగంలోకి దిగి ఉండాలి, కానీ అప్పటికే కాంగ్రెస్ తో విసిగిన జనం అన్నగారిని ఆకాశానికెత్తారు. బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి కుర్చీ అప్పగించారు. అలా పెద్దగా పదవీ ఆశలు లేకుండా. అంచనాలు అంతకంటే లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎం అయిపోయారు. అది కూడా కేవలం తొమ్మిది నెలల్లోనే. దాంతో ఆయనలో తాను దైవాంశ సంభూతుడిని అన్న భావన ఏర్పడింది. ఎన్టీయార్ రాజకీయ రంగప్రవేశం చేసిన కాలం కూడా చాలా ముఖ్యమిక్కడ. ఆయన పొలిటికల్ ఎంట్రీ నాటికి ఇందిరాగాంధీ రాజకీయంగా బలహీనంగా ఉన్నారు. ఆమె చరిష్మా తగ్గుతోంది. మరో వైపు తన రాజకీయ వారసుడు సంజయ్ గాంధీ ఆకస్మిక మరణంతో ఆమె వ్యక్తిగతంగా కుంగిపోయారు. నిజానికి 1984 అక్టోబర్ 31న ఆమె మరణించి ఉండకపోతే నాడే బీజేపీ సహా విపక్షాలు అధికారాంలోకి వచ్చేవి. ఆమె మరణంతో రాజీవ్ గాంధీ ప్రధాని కావడంతో వాజ్ పేయి అద్వానీ వంటి ఉద్ధండులు ఓడి వాడిపోయారు. ఏమీ చెసేది లేక అస్త శస్త్రాలు వదిలేసి మూలకు చేరిన వారిని పిలిచి ఎన్టీయార్ జాతీయ రాజకీయాల మీద ఆశపడ్డారు. గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఎన్టీయార్ పక్కన వారు చేరడంతో తాను నేషనల్ హీరో అని భావించారు.ఇక ఎన్టీయార్ చూపు ముఖ్యమంత్రి నుంచి ప్రధాని కుర్చీ మీదకు పడింది. మొదట చెప్పుకున్నట్లుగా పెద్దగా ఆశ, కోరిక లేని రోజుల్లో ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చి జనాలు రామారావుని దీవించారు. కానీ పేరాశకు పోయిన ఎన్టీయార్ 1984 నుంచి 1989 వరకూ ఉన్న కాలంలో భారతదేశం పేరిట జాతీయ పార్టీని స్థాపించాలని తెగ ఆరాటపడ్డారంటారు. ఆయన హిందీ కూడా నేర్చుకుని ఇతర రాష్ట్రాల్లో విపక్ష పార్టీలకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించేవారు. అలా అన్న గారు నడిపిన జాతీయ రాజకీయం బెడిసికొట్టింది. చివరకు ఆయనకు 1989 ఎన్నికల్లో రెండంటే రెండు ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక ఉమ్మడి ఏపీలో 73 ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుని ప్రతిపక్షంలోకి జారిపోయారు. ఆ మీదట రామారావుని ఢిల్లీ రాజకీయాల్లో పట్టించుకున్న వారు ఎవరూ లేరు.ఇపుడు తెలంగాణ సీఎం కేసీయార్ నయా భారత్ అంటున్నారు. ఆయనది కూడా ఎన్టీయార్ భారత దేశం లాంటి రాజకీయ ప్రయోగమే. ఆయన కూడా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష శక్తులతో సమాఖ్య మాదిరిగా ఏర్పాటు చేసి తాను జాతీయ హీరో అవుదామనుకుంటున్నారు. అయితే చంద్రశేఖరరావు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. తెలంగాణా సమాజం ఆయన్ని సీఎం నే ఇష్టపడుతోంది. అందుకే ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట మూడొంతుల సీట్లు వచ్చాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో కేవలం సగం లోక్ సభ స్థానాలే దక్కాయి. ఇక ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 35 సీట్లు వచ్చి లోక్ సభలో అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉండబట్టి ఎన్టీయార్ కు భారత దేశం పార్టీ ఆశలు కలిగాయి.ఇక కేసీయార్ కి తెలంగాణాలో ఉన్నవే 17 ఎంపీ సీట్లు, వాటిని మొత్తానికి మొత్తం గెలిచినా ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్న జగన్ ఆయనకు మద్దతు ఇస్తారా. 21 సీట్లు ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ జై కొడతారా. 39 ఎంపీ సీట్లు ఉన్న తమిళనాడు స్టాలిన్ దగ్గరకు చేరుతారా. అలాగే, 42 ఎంపీ సీట్లు ఉన్న మమతా బెనర్జీ కేసీయార్ కి ఎందుకు సై అంటుంది. ఇక కేసీయార్ కంటే మమత సీఎంగా సీనియర్, పైగా ఆమె ఆయన కంటే ముందే కేంద్ర మంత్రిగా పనిచేశారు. జాతీయంగా పలుకుబడి ఆమెకే ఎక్కువ. అందువల్ల ఆమె తానే ఒక జాతీయ పార్టీ అన్నా అంటారు. కేసీయార్ ని నిరాశపరచడం కాదు కానీ రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలకు జాతీయ రాజకీయాల్లో కీలకం కావడం అంటే బహు కష్టమని చెప్పకతప్పదు. ఏది ఏమైనా కేసీయార్ జాతీయ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.