మెదక్, సెప్టెంబర్ 14,
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించాల్సిన సభపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఎలా ఉన్నా అసలైన సత్తాను ఈ నెల 17న జరిగే దళిత-గిరిజన దండోరాలో చూపించాలనుకుంటున్నది. దీన్ని సక్సెస్ చేసి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలనుకుంటున్నది. ఇందుకోసం భారీ స్థాయిలో ప్లాన్ జరుగుతున్నది. సమిష్టి కృషితో విజయవంతం చేయడంకోసం గాంధీ భవన్‌లో విస్తృతంగా చర్చించాలనుకుంటున్నది. పీసీసీ మాజీ చీఫ్‌లతో పాటు సీనియర్ నేతలందరితో సమావేశం కానున్నది. రాహుల్ గాంధీని ఆహ్వానించినా హాజరుకావడంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరోవైపు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపకల్పన, రోడ్ మ్యాప్ తయారీపై రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటైంది.రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో దళిత-గిరిజన దండోరా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి నుంచి మొదలుపెట్టింది. ఈ నెల 17న గజ్వేల్‌లో జరగనున్నది. ఇందుకోసం పార్టీలోని వర్గాలు, గ్రూపులకు అతీతంగా సమిష్టిగా విజయవంతం చేయడంపైనా, పార్టీ శ్రేణులను భారీ స్థాయిలో అక్కడికి తరలించడంపైనా, నిర్వహణపైనా సీనియర్ల సలహాలు, సహకారాన్ని తీసుకోనున్నది. గాంధీ భవన్‌లో సోమవారం సమావేశాన్ని నిర్వహించుకుని సమిష్ట సహకారంతో నభూతో తరహాలో నిర్వహించాలని భావిస్తున్నది. పీసీసీ మాజీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్ తదితర సీనియర్ నేతలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత అంటీ ముట్టనట్లుగా ఉన్న జీవన్‌రెడ్డి, జానారెడ్డి తదితరులను కూడా ఈ మీటింగ్‌కు పిలిచింది.మరోవైపు ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ లాంటి విభాగాల నుంచి కూడా శ్రేణులను గజ్వేల్ సభకు తరలించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ స్థానికంగా పార్టీల నేతలు శ్రేణులతో సమావేశమవుతున్నాయి.పార్టీని పటిష్టం చేయడానికి, రాజకీయ పోరాట రూపాలను ఎంచుకోడానికి, కార్యాచరణను ఖరారు చేయడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటుచేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు మాజీ చీఫ్‌లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, సీనియర్ నేతలు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేణుకాచౌదరి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బలరాం నాయక్, పోడెం వీరయ్య, సీతక్క తదితరులంతా ఉన్నారు. వీరందరితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్రంలోని ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణ ఇన్‌ఛార్జిలుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ నియమించిన కమిటీల చైర్మన్లు తదితరులంతా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉంటారు.టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం డ్రగ్స్, గంజాయి, మద్యం మత్తులో జోగుతోందని, విశ్వనగరం ప్రతిష్ఠ చివరకు ఇలా అయిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. పాలన సాగించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో సేదతీరుతున్నారని పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న సైదాబాద్‌లో ఆరేళ్ల గిరిజన పసిపాపపై హత్యాచారం జరిగి ప్రాణాలు వదిలిందని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. న్యాయం కోసం బాధితుల ఆర్తనాదాలు ఆయనకు వినిపించడంలేదా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన పాలనకు నిరసనగా దగ్ధమవుతున్న దిష్టిబొమ్మలు రేపటి ఆయన పాలనకు చరమగీతం పాడడానికి సంకేతమని వ్యాఖ్యానించారు.