ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల గండం పొంచి ఉందని కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మేఘాలయ, అసోం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్ లలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్ లలో తుపాను ప్రభావంతో వర్షాలు పడతాయని వెల్లడించింది. గతవారంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో 124 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 300 మంది గాయపడ్డారు. హెచ్చరికల నేపథ్యంలో 7, 8 తేదీల్లో అన్ని పాఠశాలలకు హర్యానా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.