సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
కమిషనర్ దినేష్ కుమార్
నెల్లూరు
వర్షాకాలంలో నిలువ ఉన్న వాన నీటిలో పెరిగే డెంగ్యూ, మలేరియా దోమలతో వ్యాప్తిచెందే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆరోగ్యశాఖ అధికారులు, సచివాలయం ఉద్యోగులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారాన్ని ప్రత్యేక డ్రైడే గా నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలంతా వారి నివాసాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, తాగి పారేసిన టెంకాయలు, వాడకంలో లేని వస్తువుల్లో నిల్వ ఉన్న వాన నీటితోనే దోమల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. కార్పొరేషన్ నుంచి అన్ని ప్రాంతాల్లోని మురుగు కాలువల్లోనూ, వర్షపు నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్, ఫాగింగ్ తో పాటు ఇతర దోమల నివారణ చర్యలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ ప్రకటించారు. ప్రస్తుతం చెత్త సేకరణకు వినియోగిస్తున్న 54 వాహనాలకు తోడు మరో 125 నూతన వాహనాలను సంసిద్ధం చేశామని తెలిపారు. నగరంలోని ప్రతి ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, షాపులు, అపార్ట్మెంట్ ల నుంచి సేకరించిన చెత్తను పూర్తిగా కప్పివేసిన వాహనాల్లో తరలిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్తను వేరు చేసి, అనవసర వ్యర్థాలను విడిగా చేసి రీసైక్లింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని తెలిపారు. డస్ట్ బిన్స్ వాడకుండా నేరుగా ఇంటి నుంచే చెత్తను సేకరించే విధానంతో నగరం స్వచ్ఛంగా ఉండటంతో పాటు, డస్ట్ బిన్ లేని కారణంగా రోడ్లపై పశువులు, పందులు, కుక్కల సంచారం పూర్తిగా తగ్గిపోతుందని కమిషనర్ పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీకి నూతన వాహనాలను ప్రభుత్వం అందజేయనుందని, అప్పటినుంచి ప్రతీ ఇంటి నుంచి ప్రతీ రోజు సేకరించే చెత్తను శాస్త్రీయ విధానంలో రీ సైకిల్ చేయించి ఎరువుల తయారీ చేయనున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.