అత్యధిక జనాభా గల భారత దేశంలో యువశక్తిని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, జనాభాలో దాదాపు 60 శాతం 35 ఏళ్లలోపు యువతే ఉందని, వారే దేశానికి పెట్టుబడి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రామ్‌నగర్‌లోని ప్రొ.జయశంకర్ స్టడీ సర్కిల్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మన్ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరిలో ఏ ప్రతిభ దాగుందో గుర్తించి, యువతను సరైన మార్గంలో నడిపించినట్లయితే దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని డాక్టర్ లక్ష్మన్ అభిప్రాయపడ్డారు. యువతే దేశానికి వెన్నముక అని, యువశక్తి నిర్వీర్యం కాకుండా..వారిలో ఆత్మస్థైర్యం పెంపొందింపచేయాలన్నారు.
మనదేశంలో అపారమైన ఖనిజసంపద, అద్భుతమైన సహజవనరులు ఉన్నాయని, దేశ సంపద నిర్మాణంలో యువత పాత్ర అమోఘమైనదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. చదువుకున్న యువతీ, యువకులు ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా.. తామే స్వయానా పారిశ్రామిక వేత్తలుగా తయారవ్వాలన్న ఉద్దేశంతో స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ యువతకు 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలిచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. యువతను ప్రోత్సహించేలా ఇన్నోవేటివ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
పేదల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, పేదల కష్టాలు తెలిసిన ప్రధానిగా నరేంద్రమోదీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ... పేదల గుండెల్లో స్థానం సంపాదించారని డాక్టర్ లక్ష్మన్ పేర్కొన్నారు. కట్టెల పొయ్యితో వంటచేస్తూ..
నిరుపేద తల్లుల కంట కన్నీరు రాకూడదన్న లక్ష్యంతో.. ఉజ్వల పథకంలో భాగంగా... దేశంలో 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, ఒక్క తెలంగాణ లోనే 20 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం యావత్ యువతకు ఆదర్శనీయుడని, వీధి దీపాల కింద చదివి, బాల్యంలో ఎన్నో కష్టాలు అనుభవించి అబ్దుల్ కలాం ప్రపంచానికే ఆదర్శనీయుడిగా ఎదిగారన్నారు.ఆత్మస్థైర్యం, అచంచల విశ్వాసంతో పాటు అవరోధాలను అధిరోహించి ముందడుగు వేయాలని డాక్టర్ లక్ష్మన్ సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట.. యువతకు శిక్షణ కల్పించి, వారి కాళ్లమీద వాళ్లు నిలబడి, అభివృద్ధి చెందేలా అనేక కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం చేపట్టిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ముద్రా బ్యాంకులోన్ల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మోదీప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.స్వామి వివేకానంద చెప్పినట్లు.. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్రసంకల్పం గల యువత ఇవాళ దేశానికి అవసరమని, అవినీతి రహిత భారత్, అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత సమాజం కోసం యావత్ యువత నడుం బిగించాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు. యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపి దేశాన్ని ముందుకు నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్నా సంకల్పానికి అందరూ కలిసి కలిసి రావాలని డాక్టర్ లక్ష్మన్ పిలుపునిచ్చారు.