భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనపై కాంగ్రెస్ పార్టీ పట్టు వీడడం లేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రే యాజ్నిక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి దుష్ప్రవర్తనను నిరూపించే ఆధారాల్లేవంటూ వెంకయ్య నోటీసును తిరస్కరించడాన్ని వారు సవాల్ చేశారు. నోటీసుపై నిర్ణీత సంఖ్య మేరకు ఎంపీలు సంతకాలు చేసిన తర్వాత దాన్ని ఉపరాష్ట్రపతి తిరస్కరించడం కుదరదని, ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీని నియమించాల్సి ఉంటుందని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.పిటిషనర్ల తరఫున కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ ముందు వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ పై ఆరోపణలకు సంబంధించిన పిటిషన్ కనుక ఆయన తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తి దీనిపై నిర్ణయం తీసుకోగలరని, అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని సిబల్ కోరారు. అయితే, బెంచ్ మాత్రం దీన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సి ఉంటుందని పేర్కొంది. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరస్కరించిన విషయం తెలిసిందే.