YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

భారీగా పెరగనున్న సాగు విస్తీర్ణం..

భారీగా పెరగనున్న సాగు విస్తీర్ణం..

కాకినాడ‌, సెప్టెంబ‌ర్ 15, 
సమృద్ధిగా ఉన్న సాగునీటితో వరి సాగులో ఉభయ గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచి ధాన్యాగారంగా భాసిల్లుతుండగా అనంతపురం జిల్లాలో ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగును రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వినియోగించుకుంటూనే అలాంటి అవకాశం లేని చోట్ల ఇతర పంటలను సాగు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. పండ్ల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కోసం అనంతపురం నుంచి దేశ రాజధానికి ప్రత్యేకంగా కిసాన్‌ రైలు ఇప్పటికే ప్రారంభమైంది. రైతన్నకు ఆదాయంతోపాటు అందరికీ ఆరోగ్యాన్ని పంచేలా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేలా మిల్లెట్‌ బోర్డును ఏర్పాటు చేసింది.
డలి వైపు కదిలిపోతున్న కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా జలాలను ఒడిసి పట్టడం ద్వారా ఈ ఖరీఫ్‌లో 1.11 కోట్ల ఎకరాలకు సాగు నీరందించేలా రాష్ట్ర ప్రభుత్వం  ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్‌ఐడీసీ(ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) ఎత్తిపోతల పథకాల కింద ఇప్పటికే 52 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేశారు. నాగార్జునసాగర్‌కుడి, ఎడమ కాలువలు, రాయలసీమలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, సోమశిల, కండలేరు ఆయకట్టులో పంటల సాగులో  నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరునాటికి సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని, నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆయకట్టుకు నీళ్లందిస్తామని జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి.  గతేడాది ఖరీఫ్‌లో 1,00,44,463 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించారు. రాష్ట్ర చరిత్రలో ఖరీఫ్‌లో కోటి ఎకరాలకు నీళ్లందించడం అదే ప్రథమం. ప్రస్తుత ఖరీఫ్‌లో 1,11,41,471 ఎకరాలకు నీళ్లందించడం ద్వారా గత రికార్డును తిరగరాసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  గతేడాది 171.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడం సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వం దేశానికి ధాన్యాగారంగా రాష్ట్రాన్ని మరోసారి నిలబెట్టింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా దిగుబడులు సాధించేలా అన్నదాతలను ప్రోత్సహించడం ద్వారా ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా రాష్ట్రానికి ఉన్న పేరును ఇనుమడింపజేయాలని నిర్ణయించింది. కృష్ణమ్మ పరవళ్లతో పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో ప్రాజెక్టులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో 561 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పెన్నా బేసిన్‌లో గండికోట, మైలవరం, వెలిగోడు, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో 115 టీఎంసీల మేర నిల్వ ఉన్నాయి.
వంశధారలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్‌ 9న ఎత్తిన గొట్టా బ్యారేజీ గేట్లు ఇప్పటివరకూ దించలేదు. నాగావళి బేసిన్‌లో తోటపల్లి బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట గేట్లను కూడా దించలేదు.  ఏలేరు బేసిన్‌ ఏలేరు ప్రాజెక్టులో 22.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పటిదాకా 6,86,614 ఎకరాల ఆయకట్టులో వరి సాగుతో ప్రథమ స్థానంలో ఉండగా తూర్పుగోదావరి 6,77,224 ఎకరాల్లో వరి సాగుతో రెండో స్థానంలో ఉంది.  కృష్ణా జిల్లా 6,08,973 ఎకరాల్లో వరి సాగుతో మూడో స్థానంలో నిలిచింది.  5,73,531 ఎకరాల్లో వరి సాగుతో శ్రీకాకుళం జిల్లా నాలుగో స్థానంలో ఉంది.  
మొత్తమ్మీద ఇప్పటిదాకా సుమారు 52 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలో  అన్నదాతలు వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి తదితర పంటల సాగు చేపట్టారు.

Related Posts