YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనాభా తగ్గించుకుంటే శిక్షలు వేస్తారా...

 జనాభా తగ్గించుకుంటే శిక్షలు వేస్తారా...

అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం చర్యలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పదిహేనో ఆర్థిక సంఘం టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సును వ్యతిరేకిస్తూ అమరావతి సచివాలయం వేదికగా జరుగుతున్న 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపడం సరికాదని స్పష్టంచేశారు.

కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని.. కష్టపడుతున్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ అదే జరుగుతోందని అన్నారు.కేంద్రం నిధులూ ఇవ్వకపోవడం. రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన కారణంగా ఏపీ రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందని అన్నారు. హేతుబద్ధత లేని విభజనతో నష్టపోయామని అన్నారు. ఏపీతోపాటు రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. పేదరిక నిర్మూలన కోసం కొత్త విధానాలు తీసుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉన్నట్టుండి జనాభాను కట్టడి చేయడం కష్టమని అన్నారు. కేరళ రాష్ట్రం జనాభా నియంత్రణలో ముందుందని అన్నారు. అందరి లక్ష్యం పేదరిక నిర్మూలనే ఉండాలని చెప్పారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు మారాల్సిందేనని అన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఇబ్బందులు కలిగేలా 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు ఉండాలని అన్నారు. ఎక్సౌజ్, కమర్షియల్ టాక్స్‌లే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయమని, కానీ, వాటిని భర్తీ చేసేందుకు కేంద్రం అంగీకరించడం లేదని అన్నారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్డుడు మాట్లాడుతూ.. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్‌లో పదికి చేరుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని పశ్చిమబంగా ఆర్ధిక మంత్రి అమిత్ మిత్ర అన్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్‌గా తీసుకున్నారని.. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలుసునన్నారు.సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 15వ ఆర్ధిక సంఘం ద్వారానే కాదు.. వివిధ రూపాల్లో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాకర్షక పథకాలకు నిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని అమిత్‌ మిత్ర అన్నారు.పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని.. కొన్ని రాష్ట్రాలకు కేంద్రం వాటా ఎక్కువగా వెళ్తోందని పంజాబ్‌ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.కేరళలో నిర్వహించిన తొలి సమావేశానికి నాలుగు రాష్ట్రాలు మద్దతే లభించిందని.. ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాల సంఖ్య పెరిగిందని కేరళ మంత్రి థామస్ ఐసాక్ అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో పదికి పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఆర్బీఎంను 1.7 శాతానికి కుదించే ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. రెవెన్యూ డివల్యూషరన్‌ను 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామంటే కొన్ని రాష్ట్రాలకు ఇబ్బందేనని థామస్‌ ఐసాక్‌ అన్నారు.ఎఫ్ఆర్బీఎంను 1.7శాతానికి కుదించాలని కేంద్రం చూస్తోందని యనమల అన్నారు. 15వ ఆర్థిక సంఘం టీవోఆర్ ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతున్నాయని మంత్రి ధ్వజమెత్తారు.మొదటి దశ సమావేశం ఏప్రిల్10న కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఇప్పుడు రెండో సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటి సమావేశంతోపాటు ఈ సమావేశానికి కూడా తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో తాము పాల్గొనడం లేదని మంత్రి ఈటెల ఇంతకుముందు చెప్పారు

Related Posts