విజయవాడ, సెప్టెంబర్ 15,
టీటీడీ పాలకమండలి విషయంలో సభ్యుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే రెన్యువల్ చేసింది. మిగిలిన పాతిక మంది సభ్యుల ఎంపికలో రకరకాల కొలమానాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. సేవాభావం కలిగినవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే సీఎంతో వరుసగా భేటీ అవుతున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాతికమందితోపాటు.. మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అయితే.. వీరికి విధాన పరమైన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర ఉండదు. తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు కల్పించనుంది జగన్ ప్రభుత్వం. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు నుంచి ఇద్దరు, కర్నాటక నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా మల్లాడి కృష్ణారావు నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయాన్ని మల్లాడి మీడియాకి వెల్లడించారు. తనను టీటీడీ సభ్యునిగా నియమించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు మల్లాడి. టీటీడీ పాలకమండలి ప్రకటన ఈరోజు సాయంత్రం గాని.. రేపు గాని ఉండే అవకాశముంది.ఇదిలావుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. తిరుమల వెంకన్నతో జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు. జంబో పాలకమండలి నిర్ణయం సరికాదని సూచించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై సీఎం పునరాలోచన చేయాలన్నారు. పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.