ఈ ఏడాదికి టాలీవుడ్‌లో తొలి సిసలైన బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తోంది ‘రంగస్థలం’. మార్చి నెలాఖరులో విడుదలై యాభై రోజుల దిశగా పరుగులు తీస్తున్న ఈ సినిమా ఇదే వ్యవధిలో రికార్డు స్థాయి వసూళ్లను సంపాదించుకోవడం గమనార్హం. ప్రీ రిలీజ్ మార్కెట్‌లో 80 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలనే పండించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాల వారీగా చూసుకున్నా, ఓవరాల్‌గా చూసినా ఈ సినిమా అందరికీ లాభాల పంటను పండించిందని ట్రేడ్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. షేర్ వసూళ్ల విషయంలో రంగస్థలం సినిమా 120 కోట్ల రూపాయల మార్కును దాటేసిందని వీరు చెబుతున్నారు. అంటే 80 కోట్ల రూపాయల పెట్టుబడికి 40 కోట్ల రూపాయల లాభాలు వచ్చినట్టు. 34వ రోజుకు ఈ సినిమా 120 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇక ప్రాంతాల వారీగా చూసుకున్నా ఈ సినిమా భారీ లాభాలను రాబట్టిందని సమాచారం. యూఎస్‌లో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 9 కోట్ల రూపాయలకు అమ్మగా దాదాపు 17 కోట్ల రూపాయల వసూళ్ల షేర్‌ను రాబట్టిందట ఈ సినిమా.నైజాంలో 18 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ మార్కెట్‌కు గానూ 27 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట. సీడెడ్‌లో 12 కోట్లకు గానూ 17 కోట్ల రూపాయలను సాధించిందని సమాచారం. ఉత్తరాంధ్రలో 8 కోట్ల ముందస్తు వ్యాపారానికి గానూ 12 కోట్ల రూపాయలను రాబట్టిందట రంగస్థలం. ఇక ఏపీలోని మిగతా ప్రాంతాల్లో కూడా మంచి లాభాలే వచ్చినట్టుగా ట్రేడ్ నిపుణులు వివరిస్తున్నారు.