ట్రిబ్యునల్స్ ఎంపికలో ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ సెప్టెంబర్ 15
ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ట్రిబ్యునల్ నియామకాలు మొత్తం పూర్తవ్వాలని, ఎవరినైనా నియమించకపోతే కారణం చెప్పాలని ఆదేశించింది. మనది ప్రజాస్వామ్య దేశం. మీరు కచ్చితంగా చట్టాన్ని అనుసరించాల్సిందే అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.ప్రభుత్వం అడిగినందుకే మేము కొవిడ్ పరిస్థితుల్లోనూ దేశమంతా తిరిగి 544 మందిని ఇంటర్వ్యూ చేశాం. అందులో నుంచి 11 మంది జ్యూడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యుల పేర్లు ఇచ్చాం. ఇంతమందిలో కొందరినే నియమించారు. మిగతా వాళ్ల పేర్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు అని రమణ అన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియామకాలు చూశాను. మేము ఎక్కువ సిఫార్సులు చేశాం. కానీ అందులో నుంచి కొందరినే నియమించారు. ఇదేం ఎంపిక? ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ అలాగే చేశారు. మీ నిర్ణయాలు చాలా అసంతృప్తి కలిగించాయి అని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. కొన్ని సిఫార్సులను వదిలేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. దీనికి రమణ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దురదృష్టకరం. మేము దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేశాము. మా టైమ్ వేస్ట్ చేసినట్లేనా? ప్రభుత్వం కోరితేనే కదా మేము చేసింది అని అన్నారు. ఈ అంశంపై సీజేఐతోపాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమైతే సెలక్షన్ కమిటీకి ఉన్న విలువేంటని జస్టిస్ నాగేశ్వర్ రావ్ ప్రశ్నించారు.