YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి దువ్వాడ

రంగంలోకి దువ్వాడ

శ్రీకాకుళం, సెప్టెంబర్ 16, 
సిక్కోలు రాజకీయాల్లో ఆయన రూటే సెపరేట్. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటూ కూడా విపక్ష నేతలు సైతం అనుభవించని కష్టాలు పడ్డారు. స్వపక్షంతోనూ, విపక్షంతోనూ ఏకకాలంలో పోరు సలిపారు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు. రాజకీయంగా అనేక కష్టాలు అనుభవించారు. చివరికి రెండు దశాబ్దాల తరువాత జగన్ దయతో చట్ట సభలలోకి అడుగు పెట్టారు. ఆయనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయనకు వైసీపీలో గురువుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. సొంత పార్టీలో ఉన్నా కూడా ధర్మాన ప్రసాదరావుతో పెద్దగా కలవరంటారు. ఇక డిప్యూటీ సీఎం క్రిష్ణదాస్ తో రిలేషన్స్ బాగానే ఉన్నాయి.
ఇప్పటిదాకా శ్రీకాకుళం జిల్లా రాజకీయం చూస్తే అటు కింజరాపు, ఇటు ధర్మాన‌ ఫ్యామిలీస్ మధ్యనే కేంద్రీకృతమైంది. టీడీపీ అధికారంలో ఉంటే కింజరాపు వారిదే హవా. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ అయితే ధర్మాన వారికే పెద్ద పీట. ఇక ఈ ధోరణిని మార్చాలని జగన్ భావిస్తున్నట్లుగానే ఉంది. అందుకే ఆయన బీసీ నేతలను, ప్రత్యేకించి కాళింగ సామాజికవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులోనూ ఫైర్ బ్రాండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ని ముందుండి నడిపిస్తున్నారు. ఆయన కోరకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. విస్తరణ జరిగితే రేసులో ఈ జిల్లా నుంచి తమ్మినేని సీతారామ్, రెడ్డి శాంతి విశ్వాసరాయి కళావతి వంటి వారి పేర్లు మాత్రమే ఇప్పటిదాకా వినిపిస్తున్నాయి. ఇపుడు సడెన్ గా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎంట్రీ ఇచ్చారు అంటున్నారు.దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్లు ఎపుడూ టెక్కలిలోనే ఎక్కువగా పెడతారు. ఆయన శ్రీకాకుళం పార్టీ ఆఫీస్ దాకా కూడా రారు. అలాంటిది ఏకంగా తాడేపల్లి ప్రధాన కార్యాలయం దాకా వెళ్ళి మరీ అక్కడ మీడియా మీటింగ్ పెట్టారు అంటే కచ్చితంగా జగన్ కళ్లలో పడాలనే తాపత్రయం ఉంది అంటున్నారు. ఇప్పటిదాకా గురువు తమ్మినేని సీతారామ్ కి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వచ్చిన దువ్వాడ ఇలా దూకుడు చేయడం కూడా శ్రీకాకుళం రాజకీయం వర్గాలలలో చర్చనీయాంశంగా ఉంది. ఆయన జగన్ సర్కార్ ని విమర్శిస్తున్న చంద్రబాబు. లోకేష్ లకు గట్టి కౌంటరే ఇచ్చేశారు. ఈ మధ్యకాలంలో ఇంతలా పవర్ ఫుల్ గా టీడీపీ మీద బాణాలు వేసిన వారు కూడా లేరు. దాంతో దువ్వాడ మీడియా మీట్ జగన్ దృష్టిని చేరిందనే అంటున్నారు.కొత్త క్యాబినేట్ ఎలా ఉండాలి అన్న దాని మీద జగన్ ఆలోచ‌నలు చూస్తే దువ్వాడకు చాన్స్ ఉంటుంది అనుకోవాలేమో. యువతకు పెద్ద పీట వేయడమే కాదు, నోరున్న నేతలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇక శ్రీకాకుళం అంటే అచ్చెన్నాయుడు, కింజరాపు ఫ్యామిలీ అన్న ముద్ర ఉంది. అచ్చెన్నను ఢీ కొట్టే మొనగాడిగా దువ్వాడ శ్రీనివాస్ ని నిలబెట్టాలి అంటే మంత్రిని చేయాల్సిందే అంటున్నారు. తమ్మినేని సీతారాంమ్ దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో దువ్వాడ శ్రీనివాస్ కు పదవి ఇచ్చినా సమీకరణలలో తేడా రాదు అని అంటున్నారు. మొత్తానికి జగన్ పిలిచారా. దువ్వాడ వెళ్లారా అన్నది పక్కన పెడితే తాడేపల్లి ఆఫీస్ నుంచి దువ్వాడ చేసిన పొలిటికల్ సౌండ్ మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీ వర్గాలలో అతి పెద్ద చర్చకు తెరలేపుతున్నాయి.

Related Posts