YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేట్ పరం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు

ప్రైవేట్ పరం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు

తిరుపతి, సెప్టెంబర్ 16,
త్వరలో తిరుపతి ఎయిర్‌పోర్టు ప్రైవేట్‌పరం కానుంది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్‌ పోర్టు కూడా ఒకటి. ఇదేగనుక జరిగితే తిరుచ్చి ఎయిర్‌ పోర్టు పరిధిలోకి తిరుపతి విమానాశ్రయం రానుంది. తిరుమల దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తే తప్పక లాభాల బాటలో నడిచే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ప్రైవేట్‌ జెండా ఊపడం విమర్శలకు తావిస్తోంది. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ రూ.22 కోట్లకు పైగా లాభాల్లో ఉంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ రూ.35 కోట్ల నష్టాల్లో ఉంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్‌ పోర్ట్‌ కూడా తిరుపతే. కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గటం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.1971లో తిరుపతి విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. అంచెలంచెలుగా తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. నాటి ప్రధాని పివి నరసింహారావు హయాంలో రూ.11 కోట్లతో కొత్త టెర్మినల్‌ ఏర్పాటు చేశారు. ఆధునీకరించిన విమానాశ్రయాన్ని ప్రధాని వాజ్‌పారు ప్రారంభించారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. అదే ఏడాది మరో నూతన టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కానీ ఇప్పటివరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తిరుపతి విమానాశ్రయం ద్వారా 8,40,963 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కేవలం హైదరాబాద్‌, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నంలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిని అందుకునేందుకు రన్‌ వేను 3,810 మీటర్లకు అనగా 12500 అడుగులకు విస్తరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 712 ఎకరాల భూమిని ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీకి అప్పగించింది. 200 కోట్ల రూపాయలతో రన్‌ వే విస్తరణ, పార్కింగ్‌ పనులకు ఇది వరకే ఆమోదం పొందింది. రెండు విఐపి లాంజ్‌లు, 250 కార్లు పార్కింగ్‌ చేయగల సామర్థ్యం ఉంది. 2020 మార్చిలో 44,575 మంది ప్రయాణీకులు ప్రయాణించగా.. 2021 మార్చిలో 65,110కి పెరిగింది. 2019 ఏప్రిల్‌ నుంచి 2020 మార్చి వరకు 8,34,984 మంది ప్రయాణికులు తిరుపతికి ప్రయాణించారు. కొవిడ్‌ కారణంగా కొంతమేర విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకు 3,52,375 మంది రాకపోకలు సాగించారు. ఎయిర్‌ పోర్టుల ప్రైవేటీకరణ ప్రక్రియలో తొలిసారి మేజర్‌ ఎయిర్‌ పోర్టులతో చిన్న ఎయిర్‌ పోర్టులను కలుపుతున్నారు.

Related Posts