YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇ- క్రాప్ డేటా మాయం

ఇ- క్రాప్ డేటా మాయం

విజయవాడ, సెప్టెంబర్ 16, 
ఇ-క్రాప్‌ డేటా కరప్టు వ్యవహారం ఇటు రైతులకు అటు వ్యవసాయ సిబ్బందికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గ్రామాల్లో వ్యవసాయ సిబ్బంది నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి పంటల సాగు నమోదు మొత్తం ప్రక్రియ పూర్తి చేశాక ఇాక్రాప్‌ యాప్‌లో డేటా మిస్‌ అవుతోంది. సేకరించిన డేటాలో కొంత భాగం కనబడకుండా పోవడంతో రైతులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. యాప్‌ పని తీరుపై వ్యవసాయశాఖ రాష్ట్ర హెడ్‌ క్వార్టర్‌కు క్షేత్ర స్థాయి నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ పై స్థాయిలో ఉలుకు పలుకు లేదని ఆరోపణలస్తున్నాయి. వ్యవసాయాధికారుల సంఘాలు ఇటీవల కమిషనర్‌ను కలిసి స్టాఫ్‌ సమస్యలపై చర్చించిన సమయంలో ఇాక్రాప్‌ డేటా కరప్టు అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. అయినప్పటికీ ఇంకా సరి చేయలేదని సిబ్బంది వాపోతున్నారు.పంటల బీమా, సున్నా వడ్డీ, రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు, సర్కారీ కొనుగోలు కేంద్రాల్లో పంటల అమ్మకాలు, సీడ్‌ సబ్సిడీ సహా రైతుల కోసం అమలు చేస్తున్న సమస్త పథకాలకు ఇ-క్రాప్‌ నమోదును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రామ సచివాలయంలో విధులు నిర్వహించే విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (విఎఎ) చేల వద్దకెళ్లి ఏ పంట సాగు చేస్తున్నారో తెలుసుకొని రైతును అక్కడ నిలబెట్టి ఫోటో తీసి ఇ-క్రాప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆధార్‌, బ్యాంక్‌ అక్కౌంట్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం, అడంగల్‌ కాపీ, సిసిఆర్‌సి కార్డు వీటినీ నమోదు చేయాలి. రెవెన్యూ డిపార్టుమెంట్‌కు చెందిన వెబ్‌ల్యాండ్‌ డేటా మ్యాచ్‌ కావాలి. బయో మెట్రిక్‌లో రైతు వేలిముద్ర సేకరించాలి. ఈ ప్రక్రియ అంతా సక్రమంగా పూర్తయ్యాక, హెడ్‌ క్వార్టర్‌ నుండి అధీకృత (అథంటికేషన్‌) సంకేతం వస్తేనే ఇ-క్రాప్‌లో రైతు పేరు నమోదవుతుంది. ఈ తతంగం మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగాలి. నెట్‌, సర్వర్‌ సమస్యలు మామూలే. టెక్నికల్‌ సమస్యలు లేకుంటే ఒక రైతు ఇ-క్రాప్‌ బుకింగ్‌కు 8- 10 నిమిషాలు పడుతుంది. ఇంతా చేశాక సేకరించిన డేటా కరప్టు అవుతోంది. వెయ్యి ఎకరాల సాగు డేటా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తే అందులో 10-20 శాతం డేటా కరప్టు అవుతోందని చెబుతుతున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక మధ్యలో 'అప్‌డేట్‌ వెర్షన్‌' అని వస్తోందని, డేటా పోతోందని లబోదిబోమంటున్నారు. సేకరించిన డేటాలో ఎంత, ఎక్కడ మిస్‌ అయిందో గుర్తించడానికి నానా ఇబ్బందులూ పడాల్సి వస్తోందని, మిస్‌ అయిన డేటా సేకరణకు మళ్లీ పొలాల వెంట తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.ఈ ఖరీప్‌ నుండి ప్రభుత్వం డిజిటల్‌తో పాటు ఇాక్రాప్‌ చేయించుకున్న రైతులకు మాన్యువల్‌ రసీదులిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. సిబ్బంది చేల వద్దకు వెళ్లకుండా, కార్యాలయాల్లో కూర్చొని ఇాక్రాప్‌ డేటాను అప్‌డేట్‌ చేస్తుండటం వలన రైతులకు పథకాలు అందట్లేదన్న ఆరోపణల నేపథ్యంలో రసీదులను తీసుకొచ్చింది. రసీదు ఇచ్చాక డేటా కరప్టు అయితే రైతులు నిలదీస్తున్నారని, రెండవ సారి సమాచార సేకరణకు సహకరించట్లేదని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 95 లక్షల ఎకరాలు సాగవుతుందని అంచనా. ఆ మొత్తం డేటాను ఇాక్రాప్‌లో నమోదు చేయాలి. పథకాల లబ్ధికి ఇాక్రాప్‌ను తప్పనిసరి చేసినందున డేటా కరప్టు అయితే రైతులకు నష్టం. ఇదే సమయంలో సిబ్బందికి ప్రాణసంకటం.

Related Posts