YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ దేశీయం

కేంద్ర నిర్ణయంతో... 2400 రైస్ మిల్లుల్ల మూత..?

కేంద్ర నిర్ణయంతో... 2400 రైస్ మిల్లుల్ల మూత..?

నల్లగొండ, సెప్టెంబర్ 16, 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు భారీగా మూతపడనున్నాయి. ఫలితంగా రైతులు మిల్లర్ల చేతిలో నిలువు దోపిడికి గురికానున్నారు. పారా బాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్రం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు పారాబాయిల్డ్ రైస్ మిల్లులను మూసేయాల్సిన పరిస్థితులు రాబోతున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన కలకలం రేపింది.రాష్ట్ర వ్యాప్తంగా 2400 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ఇవన్ని ప్రభుత్వ సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 150 వరకు పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ఒక్క మిర్యాలగూడ పరిధిలోనే 100 ఉండగా, కోదాడలో మరో 24 ఉన్నాయి. ఇందులో ఇప్పటికే చాలా మిల్లులు నష్టాల్లో నడుస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయకపోతే ఆ మిల్లులకు పని లేకుండా పోయి, అందులో పనిచేసేవారు రోడ్డునపడే ప్రమాదముంది. రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. దీంతో ఈ వానాకాలం రైతులు 55 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. దాదాపు 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనేది అధికారిక అంచనా. కాగా, దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ రైస్ మిల్లులు, ఇతర ప్రాంతాల్లో నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రం నుంచి గతంలో ఒక్క కేరళకు మాత్రమే పారాబాయిల్డ్ రైస్ ఎగుమతి కాగా, ప్రస్తుతం అక్కడి ప్రజలు సైతం సన్నరకం వడ్లకు అలవాటు పడ్డారు. దీంతో పారాబాయిల్డ్ రైస్‌ను కాకినాడ, కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ మిల్లర్లకు క్వింటాల్‌కు రూ.2,400 పడుతుంది. ఈ ధర ప్రకారం మిల్లర్లకు గిట్టుబాటు అయ్యేలా కొనుగోలు చేయాలంటే క్వింటా వరి ధాన్యాన్ని రూ.1600లోపే కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో రైతులకు కనీస మద్దతు ధర లభించదు. ఎక్స్‌పోర్టు మీద సబ్సిడీ ఇస్తే రైతులకు మద్దతు ధర దక్కే అవకాశం ఉంది. గతేడాది దొడ్డు రకం కాకుండా సన్నాలు సాగు చేస్తే కనీస మద్దతు ధర దక్కకపోనూ ధాన్యం అమ్ముకునేందుకు నానా అవస్థలు పడ్డారు. దీంతో రైతులు దొడ్డు రకం ధాన్యంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రం నిర్ణయం వల్ల అదీ పోయింది.

Related Posts