YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మళ్లీ గాంధీభవన్ కు వీహెచ్

మళ్లీ గాంధీభవన్ కు వీహెచ్

హైదరాబాద్,  సెప్టెంబర్ 16, 
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి వచ్చాక కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిత్యం ఏదో ఓచోట పార్టీ కార్యక్రమాల్లో కనిపించే వి హన్మంతరావు సైతం గాంధీభవన్‌కు రాలేదు. కానీ.. గజ్వేల్‌లో నిర్వహించే దళిత గిరిజన దండోరా సభ.. సన్నాహక సమావేశానికి వీహెచ్ వచ్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఏ దండోరా సభలోనూ హన్మంతరావు పాల్గొనలేదు. ఆహ్వానం అందకపోవడంతో సభలకు రాలేదని సన్నిహితుల దగ్గర చెబుతూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్‌లో తళుక్కుమన్నారు.మీటింగ్‌కు రావడంతోనే తన మార్క్‌ ఏంటో రుచి చూపించారు వీహెచ్‌. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం పెడితే అన్నిపార్టీల నాయకులు వెళ్తున్నారని చెప్పిన ఆయన.. సొంత పార్టీలోని ఓ కీలక నాయకుడికి లేఖ రాసినా స్పందించలేదని వాపోయారు. దీనికి రేవంత్ స్పందించాలని పట్టుపట్టారు. చివరకు గజ్వేల్ సభలో .. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం విగ్రహం పెట్టకపోతే కాంగ్రెస్‌పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు కూడా. గాంధీభవన్‌కు వచ్చిన వీహెచ్ని ఈ విధంగా రేవంత్‌ కూల్‌ చేశారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మధ్య అనారోగ్యంతో వీహెచ్ ఆస్పత్రిలో చేరగా.. పరామర్శించడానికి రేవంత్‌ వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై ఉండి కూడా పంజాగుట్ట అంబేద్కర్‌ విగ్రహం గురించే వీహెచ్ ప్రస్తావించారట. ఇప్పుడు ఆ మాటకు ప్రాధాన్యం ఇవ్వడంతో రేవంత్‌, వీహెచ్ల మధ్య కయ్యాలకు ఫుల్‌స్టాప్‌ పడిందని ప్రచారం జరుగుతోంది.ఇక పెద్దలు జానారెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇప్పుడే గాంధీభవన్‌కు వచ్చి.. కేడర్‌కు ఓ సంకేతం ఇచ్చి వెళ్లారు. పార్టీ సమావేశాలకు రావడం లేదని అనుకోకండి.. మీరు అలిసిపోయి.. సాయం కోసం ఎదురు చూసే సమయంలో వచ్చి అండగా నిలబడతా అని హామీ ఇచ్చారు జానా. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించిన సమయంలో పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించినా.. కొత్త సారథికి సపోర్ట్‌ చేశారు జానారెడ్డి. కానీ.. పార్టీ సమావేశాలకు, సభలకు రాకపోవడంతో ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే చర్చ మొదలైంది. ఈ విషయం పెద్దాయన చెవిన పడిందో ఏమో.. గాంధీభవన్‌కు వచ్చి.. సమావేశంలో పాల్గొని వెళ్లారు. తన మనసులో ఏముందో క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి.గజ్వేల్‌ దండోరా సభలో కాంగ్రెస్‌ సీనియర్లను ఒకే వేదిక మీదకు తీసుకురావాలని రేవంత్‌ చూస్తున్నారట. ఇప్పుడు సన్నాహక సమావేశానికి వీహెచ్‌, జానా రావడంతో సారథి కొంత సక్సెస్‌ అయ్యారని టాక్‌. మిగతా సీనియర్లకు ఒక సందేశం పంపారని చర్చ జరుగుతోంది. మరి.. గజ్వేల్‌ సభకు ఎంతమంది సీనియర్లు వస్తారో చూడాలి.

Related Posts