YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరంపై కే్ంద్ర అధికారి సమీక్ష

కాళేశ్వరంపై కే్ంద్ర అధికారి సమీక్ష

 కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వెల్  అవుతుంది అన్నారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ జనరల్ నిషీత్ సక్సెనా. ఈ భారీ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారన్న దానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొందని, మిగతా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయని సక్సేనా తెలిపారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, పనులు కొనసాగుతున్న తీరుపై అరణ్య భవన్ లో అటవీ, సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో సక్సేనా సమీక్షా సమావేశం నిర్వహించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో క్షేత్ర స్థాయిలో రెండు రోజుల పాటు పర్యటించిన సక్సేనా అత్యంత వేగంగా పనులు జరగటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో  భారీ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించటం ఎంత ముఖ్యమో,  ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా ఇచ్చిన అనుమతులకు తగిన విధంగా పనులు జరుగుతున్నాయో లేదోనన్న పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు.  రైతు సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నప్పుడు, అదే సమాజం కోసం పర్యావరణం కాపాడుకునేందుకు బాధ్యతాయుతంగా ఆయా శాఖల అధికారులు, వర్క్ ఏజెన్సీలు పనిచేయాలని కోరారు.  ప్రాజెక్టు కోసం మళ్లించిన అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా చేపట్టిన అటవీ పెంపకం బాధ్యతాయుతంగా జరగాలన్నారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం అనుమతులు సాధించిన అటవీ శాఖ అధికారులను, అంతే వేగంగా పనిచేస్తున్న తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులను సక్సేనా అభినందించారు. ప్యాకేజీల వారీగా జరుగుతున్న పనులను వీడియో ప్రదర్శన ద్వారా వీక్షించారు. కొన్ని రాష్ట్రాల్లో ఇరవై ఏళ్లు గడిచినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాని వాస్తవాలు చూస్తున్నామని,  కానీ రికార్డు సమయంలో నిర్మాణం అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు రానున్న రోజుల్లో దేశానికి  రోల్ మోడల్ గా నిలుస్తుందని, ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కూడా అదే విధంగా ఆదర్శంగా ఉండాలన్నారు. ఎవరూ వేలెత్తి చూపకుండా పనులు ఉండాలని, ప్రాజెక్టు వేగానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో, చెట్ల పెంపకానికి కూడా సమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.  ఆయా ప్యాకేజీ ల పనులకు సమాంతరంగా పెద్ద సంఖ్యలో మొక్కల పెంపకం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాలు రక్షిత అటవీ ప్రాంతంలో డంప్ చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.  ప్రతీ మూడు నెలలకు ఒక సారి కేంద్రం తరుపున పర్యావరణహిత పనులను పర్యవేక్షిస్తామన్నారు.  తెలంగాణకు హరితహారం ద్వారా చేస్తున్న రహదారి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది భాగుందని ఆయన మెచ్చుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సక్సేనా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధితో పాటు, నల్లగొండ దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుకు ఇచ్చిన అటవీ భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిలో మొక్కల పెంపకం చర్యలను పరిశీలించారు. తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులకు సహకరించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కే.ఝా  కృతజ్ఞతలు తెలిపారు. అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ అటవీ పెంపకం ఉండేలా అటవీ శాఖ తరుపున పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. 

సమావేశంలో అదనపు అటవీ సంరక్షణ అధికారి (అటవీ అనుమతులు) ఆర్. శోభ, కాళేశ్వరం ప్రాజెక్టు ఛీప్ ఇంజనీర్లు హరిరామ్, వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు పరిధిలోని జిల్లాల సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Posts