నెల్లూరు, సెప్టెంబర్ 17,
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావొస్తోంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అయితే స్టార్ట్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఏ ఎమ్మెల్యే అయినా చేసిందేమి లేదు. మహా అయితే ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు వారి అక్కౌంట్లోల వేస్తోన్న సంక్షేమ పథకాల డబ్బులే తప్పా కొత్తగా ప్రజలకు ఒరిగిందేమి లేదు. ఈ రెండేళ్లలో జగన్ చేసిన సంక్షేమం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అసలు రెండేళ్లలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక్కటంటే ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. అసలు అభివృద్ధి అన్న పదమే చాలా మందికి తెలియదు. జగన్ ఏదోలా అప్పు తెచ్చి సంక్షేమ పథకాలు నెట్టుకు వస్తున్నారు. మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. చిన్న చిన్న రహదారులు పనులు కూడా పూర్తి చేయలేని స్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. దీనికి తోడు కరోనా కావచ్చు.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం కావచ్చు.. ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు బెంగళూరు లేదా హైదరాబాద్‌లోనే కూర్చొంటున్నారు. ఇక రాకరాక వైసీపీ అధికారంలోకి వచ్చిందని ద్వితీయ శ్రేణి నేతల దోపిడీ అయితే ఎక్కువగానే ఉంది.ఇక పార్టీ మారిన వారు కమీషన్లు ఇస్తున్నారన్న కారణంతో పాత నేతలను ఎమ్మెల్యేలు, కీలక నేతలు పక్కన పెట్టేస్తున్నారు. ఈ గ్రూపుల గోలతో కూడా జనాల్లో పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక సీమలో గత ఎన్నికల్లో వైసీపీ వార్ వన్‌సైడ్ చేసేసింది. మొత్తం 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల విజయం సాధించింది. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేలు భూకబ్జాల నుంచి, ఇసుక దోపిడీలు, అక్రమ మైనింగ్ ఇలా అన్నింట్లోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాదు.. పేదల భూములపై కన్నేసి కూడా తక్కువ రేటుకే లాగేసుకుంటోన్న పరిస్థితి సీమలోనే ఎక్కువుగా ఉంది.వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఏ మాత్రం క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేల దందాలు, దౌర్జన్యాలపై ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేస్తే వాళ్లకు ఖచ్చితంగా మంచి మైలేజ్ ఉంటుంది. అయితే ఏపీలో వరుసగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తోన్న టీడీపీ నేతలను అరెస్టు చేసేస్తున్నారు. పైగా వారి బిజినెస్‌లను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకొచ్చిన రిస్క్ అన్న భయమో ఏమోగాని టీడీపీ ఈ వ్యతిరేకతను ఏ మాత్రం క్యాష్ చేసుకోలేకపోతోంది. వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్నా కూడా టీడీపీ వాళ్లు చావచచ్చి ఊరుకున్నట్టే ఉన్నారు.