విజయవాడ, సెప్టెంబర్ 17,
మూడు రాజధానుల కాన్సెప్ట్ పూర్తిగా జగన్ ది. దీని మీద అన్ని పేటెంట్ హక్కులూ ఆయనవే. స్క్రిప్ట్ రెడీ చేశారు, అమలుకు అంతా సిధ్ధం చేశారు. కానీ సడెన్ గా స్క్రీన్ ప్లే మార్చేశారు చంద్రబాబు. ఆయన అమరావతి రైతుల ద్వారా కోర్టులో కేసులు వేయించారు. ఆ కేసు తెమిలే వరకూ జగన్ తాడేపల్లి నుంచి అడుగు కూడా కదపని పరిస్థితి ఉంది. దాంతో ఏణ్ణర్ధంగా మూడు రాజధానుల కధ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అయితే ఇపుడు ఆ మబ్బులు మెల్లగా తొలగిపోనున్నాయి.మూడు రాజధానుల మీద హై కోర్టు విచారణకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కేసుని విచారిస్తూండగా సిక్కిం హై కోర్టుకుని బదిలీ మీద వెళ్లారు. దాంతో కొత్తగా వచ్చిన జస్టిస్ట్ గోస్వామి ఈ కేసు మీద పెద్దగా విచారణ జరపలేదు. ఇలా నెలలు గడచిపోయాయి. అయితే ఈ నెల 23 నుంచి ఈ కేసు విచారణకు నోచుకుంటోందని తెలుస్తోంది. ఇందుకోసం ఫుల్ బెంచ్ ని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం కోర్టు తీసుకుంది. ఇక మీదట ప్రతీ రోజూ ఈ కేసు విచారణ జరుగుతుంది. దాంతో వ్యవహారం జోరందుకోనుంది.మూడు రాజధానుల విషయంలో వందలకు పైగా పిటిషన్లు వచ్చి పడ్డాయి. అవి రైతులు, అమరావతి రాజధానిగా కోరుకునేవారు. వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. దాంతో ఈ కేసుని విచారించాలంటే పూర్తి సమయం కేటాయించాలని హై కోర్టు నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఇక మీదట రోజు వారీగా విచారణ జరగనుండడంతో సాధ్యమైనంత తొందరలోనే తీర్పు వచ్చే వీలుంది అంటున్నారు. దాంతో అటు అమరావతి పరిరక్షణ సమితితో పాటు ఇటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా మూడు రాజధానుల మీద తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే జగన్ కి విశాఖ వెళ్లాలని ఉంది. పాలనలో పుణ్య కాలం అంతా పోయింది. ఇపుడు మిగిలిన ఏలుబడిలోనైనా తాను అనుకున్నట్లుగా విశాఖ లో ఉంటూ కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నారు. దానికి న్యాయ పరమైన అడ్డంకులు ఉన్నాయి. ఇపుడు రోజూ వారీ విచారణ మూలంగా ఈ మూడు రాజధానుల కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజధానులు ఎన్ని ఉండాలి ఎక్కడ ఉండాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం కాబట్టి ఈ విషయంలో తమ మాట నెగ్గుతుంది అని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే తాము ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేలాది భూములు ఇచ్చాం, ఒకటే రాజధాని కాబట్టి అభివృద్ధిలో తామూ భాగం కావచ్చు అని ఆశపడ్డామని రైతులు అంటున్నారు. ఇపుడు తమ నమ్మకం వమ్ము చేశారు కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని న్యాయం చేస్తుంది అని రైతులు చెబుతున్నారు. చూడాలి మరి తీర్పు ఎలా వస్తుందో.