YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల ప్రతిష్టకు భంగం కలుగుతుంది చంద్రబాబు

తిరుమల ప్రతిష్టకు భంగం కలుగుతుంది చంద్రబాబు

అమరావతి
ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. తిరుమల ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు వున్నాయని అయన అన్నారు.  వ్యాపార ధోరణితో, రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డు గురించి అయన లేఖలో పేర్కోన్నారు.  తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక.   అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం.   ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరు ప్రఖ్యాతి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు.   భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన టీటీడీ బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించడాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన టీటీడీకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయం.   గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఇంత మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం జరగలేదు.   ఈ జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   స్వామివారిపై భక్తి భావంతో, స్వామివారి సేవలో తరించే వారికి బోర్డులో ప్రాధాన్యమివ్వకుండా.. కొంతమంది వ్యక్తుల సేవలో మునిగి తేలే వారికే అవకాశం ఇచ్చారన్నది సుస్పష్టం.   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో జంబో బోర్డు ఏర్పాటు చేశారు.  అనర్హులను సభ్యులుగా నియమించి శ్రీవారి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను కించపరిచారు.  సామాన్య భక్తుల దర్శనాలకు రకరకాల నిబంధనలు విధించి.. వీఐపీల సేవలో తరించే విధానాన్ని ప్రస్తుతం చూస్తున్నాం.   సుదీర్ఘ చరిత్ర కలిగిన తిరుమల తిరుపతిలో అడుగడుగునా భక్తిభావ తరంగాలు కదలాడాలి.   కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయాలను గాలికొదిలేసి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు.  ధర్మకర్తల మండలిలో సభ్యత్వమంటే భక్తి భావానికి ప్రతీకగా ఉండేది.   గతంలో సభ్యత్వం కల్పించాలనుకుంటే వారి వ్యక్తిగత గుణ గణాలను పరిశీలించి బోర్డులో సభ్యత్వం కల్పించేవారు.   కానీ నేడు స్వప్రయోజనాల కోసం.. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారు.  సేవాభావమే జీవిత లక్ష్యంగా ఉండే వారిని గతంలో ధర్మకర్తల మండలిలో నియమించడం జరిగింది.  కానీ నేడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను కూడా  సభ్యులుగా నియమించి బోర్డు పవిత్రతను దెబ్బతీశారు.   గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం దెబ్బతింటున్నది.   భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ టీటీడీ ఆస్తుల వేలానికి పూనుకున్నారు.   తిరుపతి-తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారు.   టీటీడీ వెబ్సైట్లో అన్యమత గేయాలు, స్విమ్స్ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం, ఎస్వీబీసీ ఛైర్మన్ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్, టీటీడీ మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాద ధరలు పెంచడం, భక్తి శ్రద్దలతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటు చేసుకున్నాయని విమర్శించారు.
 శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలకు తప్ప.. మరో చిహ్నానికి తావులేని తిరుగిరుల్లో డివైడర్లకు వైసీపీ రంగులు వేశారు, కొండపై వైసీపీ నేతలు రాజకీయ ప్రచారం చేశారు.   నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లు ఎగరేశారు. ర్యాలీలు నిర్వహించారు.   ధర్మకర్తల మండలి ఏర్పాటులో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు.   దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.   భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలి.   తిరుమల ప్రతిష్టను కాపాడాలి.   తిరుమల తిరుపతి సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి.    కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించవలసి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

Related Posts