కొత్త సీజేల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 17,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ సీజే(చీఫ్ జస్టిస్)గా కొనసాగిన అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయ్యారు. ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తిగా ఇంతవరకూ సేవలందించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సీజేగా వచ్చారు. ఇక, తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మను తెలంగాణ సీజేగా బదిలీ చేశారు. కొలీజియం సిఫారసు మేరకు ఈ బదిలీలు షురూ అయ్యాయి.కాగా, గత నెల ఆగష్టు 31న సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రలో అదే తొలిసారి. అంతేకాదు, జడ్జీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ నిర్ణయించడంతో ఇది మరో చరిత్రగా నిలిచింది.ఇక, సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్‌నాథ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.