YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఆకుస్ కూటమి కోసం ప్రయత్నం

 ఆకుస్ కూటమి కోసం ప్రయత్నం

 ఆకుస్ కూటమి కోసం ప్రయత్నం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17, 
ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా సాంకేతికత సాయంతో అణు శక్తిని కలిగిఉన్న జలాంతర్గాములను ఆస్ట్రేలియా నిర్మించనుంది. ఈ మూడు దేశాలు కలిసి అకూస్ (AUKUS) కూటమిని ఏర్పాటుచేసి.. కృత్రిమ మేధస్సు, సైబర్, క్వాంటం టెక్నాలజీస్ అంశాలలో సహకారం అందజేసుకోనున్నాయి. దశాబ్దాల కాలంలో దేశాల మధ్య ఇది అతిపెద్ద రక్షణ భాగస్వామ్యం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలి కాలంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన సైనిక శక్తి, కార్యకలాపాలను ముమ్మరం చేయడంతో ఆందోళనకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, శ్రేయస్సును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నూతన భాగస్వామ్యం ఏర్పడిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే, ఆస్ట్రేలియా ప్రధానులు బోరిస్ జాన్సన్, స్కాట్ మోరిసన్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తాజా ఒప్పందంతో 12 అణు జలాంతర్గాములను నిర్మించడానికి 2016లో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా కుదుర్చుకున్న 50 బిలియన్ డాలర్ల ఒప్పందం ముగిసినట్టే.అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య సైనిక సహకారం కొనసాగుతుందని ఇరు దేశాలూ ప్రకటించాయి. అమెరికాకు చెందిన అన్ని రకాల యుద్ధ విమానాలను ఆస్ట్రేలియాలో మోహరించనున్నట్టు తెలిపాయి. అమెరికా, ఆస్ట్రేలియా రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం ముగిసిన అనంతరం.. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ డ్యూటన్ మాట్లాడుతూ.. ఇండో-పసిఫిక్‌లో ఇరు దేశాల మధ్య సహకారం, పరస్పర చర్యలు, మైత్రి కార్యకలాపాలను మరింత పెంచాలని నిర్ణయించామని తెలిపారు.ఇరు దేశాల మధ్య వైమానిక సహాకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. తమ ఉమ్మడి కార్యకలాపాలకు మద్దతుగా లాజిస్టిక్, జలాంతర్గాములు, ఉపరితల పోరాట సామర్ధ్యాన్ని నెలకొల్పనున్నామని అన్నారు. తాజా ఒప్పందం ప్రకారం సంప్రదాయంగా నడిచే జలాంతర్గాములు కంటే అత్యాధునిక సాంకేతికతో నిర్మించనున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించే సబ్-మెరైన్లను గుర్తించడం కూడా కష్టం.ఆస్ట్రేలియాలోనే వీటిని ఉంచడం అమెరికాకు కీలకమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గత 50 ఏళ్లలో తన జలాంతర్గముల సాంకేతికతను వేరే దేశంతో అమెరికా పంచుకోవడం ఇదే మొదటి సారి. గతంలో యూకేతో మాత్రమే ఈ టెక్నాలజీని పంచుకుంది.అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్, రష్యా తర్వాత ప్రపంచంలో అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆపరేట్ చేసే ఏడో దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది. అయితే అణ్వాయుధాలను పొందే ఉద్దేశం తమకు లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.తాజా ఒప్పందం చైనాకు విరుద్ధంగా లేదని యూకే నొక్కి చెప్పినప్పటికీ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, శ్రేయస్సు, స్థిరత్వం లాంటి విషయంలో డ్రాగన్ పక్కలో బల్లెం మాదిరిగా తయారైంది. దీంతో చైనా కూడా ప్రతి వ్యూహాలు సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా సబ్ మెరైన్ తన జలాల నుంచి నిషేధించినట్లు వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది. అకూస్ కూటమి ఒప్పందాన్ని చైనా తీవ్రంగా ఖండించింది.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దురుద్దేశపూర్వక ఆయుధ పోటీ ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, అంతర్జాతీయ అణు-నిరాయుధీకరణ లక్ష్యాలకు తూట్లు పొడిచేలా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జుహో లిజియన్ అన్నారు. అయితే, చైనా విమర్శలను అమెరికా తోసిపుచ్చింది. ఈ ఒప్పందం ఉద్దేశం చైనాను లక్ష్యంగా చేసుకోవడం కాదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ సకీ అన్నారు. అంతేకాదు, గతంలో ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందానికి ఎటువంటి ఢోకా ఉండబోదని తెలిపారు.

Related Posts