తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం
ఇక్కడ సౌండ్ చేస్తే దారుస్సలంలో రీసౌండ్ రావాలి
నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్
నిర్మల్ సెప్టెంబర్ 17
తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. నిర్మల్‌లో బీజేపీ శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మల్ గడ్డమీద వెయ్యి మందిని ఉరితీశారని గుర్తు చేశారు. నిర్మల్‌లో ఉరితీసిన వెయ్యి మంది యోధుల చరిత్రను చెప్పడానికే ఇక్కడ సభ నిర్వహిస్తున్నామన్నారు.వాళ్లంతా ఇప్పుడు పైనుంచి మనల్ని చూస్తున్నారని, వాళ్లకోసం మనమంతా నినదించాలని పిలుపునిచ్చారు.‘విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని ప్రగతి భవన్‌కు మన సౌండ్ వినిపించాలి. ఇక్కడ సౌండ్ చేస్తే దారుస్సలంలో రీసౌండ్ రావాలి. రాజాకర్ల వారసులు హింసించిన హిందూ సమాజానికి మనం భరోసా ఇవ్వాలి. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం. విమోచన దినోత్సవం రోజున సీఎం కనీసం జెండా కూడా ఎగురవేయలేదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే ప్రజలను అవమానించినట్టా? కదా’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.