విజయవాడ, సెప్టెంబర్ 18,
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంట్రాక్టర్లు వారి జండా అజెండా ఆ పార్టీ దే అన్నట్లు వ్యవహారం సాగిస్తారు. తమకు పని దొరికితే చాలు అనుకుంటారు. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ల కోసమే నేతల చుట్టూ అధికారుల చుట్టూ వారు ప్రదిక్షిణలు చేయడం రివాజు. అయితే జగన్ సర్కార్ వచ్చాక వీరి సీన్ పూర్తి గా రివర్స్ అయిపొయింది. కాంట్రాక్టర్లే కాదు పార్టీ నేతల ముసుగు వేసుకుని నామినేషన్ పనులు చేసుకుందామనుకున్న వారి పుట్టి ఇప్పుడు నిండా మునిగి పోయింది. ఎందుకంటే జగన్ సంక్షేమ కార్యక్రమాల దెబ్బకు అభివృద్ధి అటకెక్కేసింది. ఏపీ ఖజానాలో చిల్లర లేకపోవడంతో ఇప్పుడు వారు వీరు తేడా లేదు రాష్ట్రం లో ఏ మూల పని చేసిన వారైనా బిల్లులు రాక ఘొల్లుమంటున్నారు.ఏపీ లో కొత్త ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లు సంబర పడ్డారు. టిడిపి హయాంలో పెండింగ్ లో ఉన్న పనుల బిల్లులు జగన్ ప్రభుత్వం క్లియర్ చేసి తమను ఒడ్డున పడేస్తుందని ఆశ పడ్డారు. అయితే సర్కార్ ఆ పని చేయలేదు సరికదా పాత ప్రభుత్వం చేసిన పనులపై విచారణలు మొదలు పెట్టింది. దాంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక వివిధ శాఖల్లో కాంట్రాక్టర్లు గా నమోదు అయిన వారు కోర్టు కు ఎక్కి తాము ఖర్చు చేసిన దాంట్లో కొంత రాబట్టుకోగలిగారు.వీరి సంగతి పక్కన పెడితే వైసిపి లో ఉంటూ కార్పొరేషన్లు, మునిసిపాలిటీ, పంచాయితీల్లో నామినేషన్లపై పలువురు కోట్లాది రూపాయల పనులు చేసేసారు. గ్రామ పంచాయితీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు పేరిట స్కూల్ భవనాలను, రోడ్లు డ్రైన్లు గ్రామాల్లో కట్టిపాడేశారు. అయితే ఈ బిల్లులు లకు చిల్లులు పడ్డాయి. ఆర్ధిక కష్టాల్లో ఉన్న జగన్ సర్కార్ వీరికి మొండి చెయ్యి చూపింది. సొమ్ములున్న మునిసిపాలిటీలు పంచాయితీల్లో ఎంతోకొంత చెల్లింపులు జరిగినా ఖజానా ఖాళీ అయిన వాటిల్లో పనులు చేసిన వారి పరిస్థితి దిక్కుమొక్కు లేకుండా పోయింది. వీరు అటు కోర్టు గుమ్మం తొక్కలేక ఇటు ఎమ్యెల్యేలు, ఎంపీ లు మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగలేక నానా అగచాట్లు పడుతున్నారు.మా ప్రభుత్వం వచ్చింది ఇక దుమ్ములేచేలా పనులు చేసుకుని నాలుగు పైసలు సంపాదిస్తాం కదా అనుకుంటే వీరికి మొదటికే మోసం వచ్చేసింది. అందుకే తాజాగా ఏపీ సర్కార్ రోడ్లు నిర్మాణం, మరమ్మత్తులు డ్రైన్లు వంటి వాటికి టెండర్లు పిలిచినా మాకొద్దు బాబోయి అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మరోపక్క కేంద్రం నుంచి రావాలిసిన నిధుల్లో కోతలు, జగన్ సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గక పోవడం, కరోనా ఆర్ధిక స్థితి తల్లక్రిందులు కావడం తో ఈ దుస్థితి నుంచి రాష్ట్రం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.