ఒంగోలు, సెప్టెంబర్ 18,
ఎయిర్ పోర్టులు లేనిచోట్ల విమానాల ల్యాండింగ్ కోసం జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో రన్‌వే (ఎయిర్ స్ట్రిప్)లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 13 చోట్ల వీటిని నిర్మించనుండగా.. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల నిర్మిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొరిశపాడు–రేణింగవరం వద్ద ఒకటి, సింగరాయకొండలోని కలికివాయ–సింగరాయకొండ అండర్ పాస్ వరకు మరొకటి ఏర్పాటవుతున్నాయి. జాతీయ రహదారిలో ఈ రన్‌వేలపై విమానాలు దిగే సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేపడతారు. సిమెంట్‌తో నిర్మించే రన్‌వేకు రెండు వైపులా రెండు గేట్లు ఉంటాయి. ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొరిశపాడు–రేణింగవరం వరకు రూ.23.77 కోట్లతో 5 కి.మీ. పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒకేసారి 4 విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్ స్ట్రిప్ నిర్మిస్తున్నారు. కలికివాయ–సింగరాయకొండ మధ్య విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం రూ.52 కోట్లతో 3.60 కిలోమీటర్ల మేర ఎయిర్ స్ట్రిప్ నిర్మించనున్నారు. 33 మీటర్ల వెడల్పున కాంక్రీట్‌తో రన్‌వే, రెండువైపులా 12.50 మీటర్ల వెడల్పున గ్రావెల్ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా మీటరు వెడల్పున డ్రైనేజీ నిర్మాణం చేపడతారు. రన్‌వేకు 150 మీటర్ల దూరంలో ఏటీసీ భవనం నిర్మిస్తారు. ప్రస్తుతం రన్‌వేకు సంబంధించి కాంక్రీట్ రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. ఇరువైపులా డ్రైనేజీ, గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. కందుకూరు ఫ్‌లైఓవర్ వద్ద కల్వర్టు నిర్మాణం పూర్తి కాగా, కలికవాయ ఫ్‌లైఓవర్ వద్ద బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది.