భక్తులను రక్షించే అమ్మవారు యోగశక్తి గా, సిరిసంపదలు ప్రసాదించే భోగశక్తిగా, దుష్టుల దుర్మార్గాలను అణిచివేసి కష్టాలు తీర్చే వీర ధీరశక్తి గా అనుగ్రహిస్తున్నది. ఈవిధంగా జగదంబ వీరశక్తిగా అనుగ్రహిస్తున్న స్ధలాలలో ఒకటి మైసూరు లోని చాముండి కొండ .ఈ కొండ మీద ఆలయంలో చాముండేశ్వరిగా దర్శనం అనుగ్రహిస్తున్నది. మహిషాసురుడనే దానవుని సంహరించడానికే అమ్మవారు ఇక్కడ అవతరించింది. మహిషాసుర్ అన్నదే కాలక్రమేణా మైసూర్ గా మారినది. దానవుడైన మహిషుడు శివుని గురించి తపమాచరించాడు. మహాదేవుడు మహిషాసురుని కి దర్శనమిచ్చాడు. మహిషాసురుడు మరణం లేని వరం కోరాడు. ఎవరైనా సరే భూలోకంలో పుట్టినవారికి మరణం తప్పదు అని పరమశివుడు మహిషాసురునికి బోధించగా కొంచెం ఆలోచించిన మహిషాసురుడు తెలీవిగా మహేశ్వరుని ఏమారుస్తున్నానని తలచి వరాన్ని మార్చి అడిగాడు. పురుషుల వల్లగాని, జంతువుల వలన గాని , నీటి వలన గాని మరణం కలుగ కూడదు అని వరం కోరుకున్నాడు. పరమేశ్వరుడు వరం అనుగ్రహించాడు. మహిషాసురుడు వరాలు దక్కాయి అన్న గర్వంతో అందర్ని హింసించసాగాడు. పరమశివుడు తానే వరమిచ్చినందున , శక్తిదేవికి మహిషాసురుని సంహరించమని ఆనతి యిచ్చాడు. ఈశ్వరుని ఆనతి ప్రకారం మహిషుడు నివసిస్తున్న ప్రాంతాన ఆషాఢ మాసంలో మూడవ శుక్రవారం నాడు దేవి అవతరించినది. 18 హస్తాలతో చాముండి గా అవతరించినది. ఒక్కొక్క హస్తంలో ఒక్కొక్క ఆయుధం ధరించి గర్వంతో వున్న మహిషాసురునితో యుధ్ధం చేసి వధించినది. అంబిక అనుగ్రహాన్ని చూసిన దేవతలు, మానవులు , ఆ ప్రాంతంలోనే కొలువై వుండి కరుణతో అనుగ్రహించాలని వేడుకొనగా, అంబిక ఆవేశాన్ని మార్కండేయ మహర్షి శాంతింప చేశారు. 18 హస్తాలను దర్శించడం భయంగా వుంటుంది అన్న కారణంగా 8 చేతులతో దేవి కొలువుతీరింది. మైసూరు నుండి 13 కి.మీ దూరంలో వున్నది అంబిక కొలువైన చాముండి కొండ. ఇది 8 చిన్న కొండల సముదాయం. ఈ కొండకి ఆదికాలంలో ' మహాబలాద్రి' అనే పేరు వుండేది. మహాబలేశ్వరునిగా ఇక్కడ పరమశివుడు కొలువైనందున ఆ పేరు వచ్చినది.ఇక్కడే అమ్మవారు చాముండేశ్వరిగా కొలువై వున్నది. 1500 సంవత్సరాల కి ముందు చిన్న ఆలయంగా వున్న యీ ఆలయాన్ని 1330 లో ఉడైయార్ వంశం వారు మైసూర్ ను పాలించిన కాలంలో ఈ ఆలయం పెద్ద ఆలయంగా నిర్మించబడినది. నవరంగ మండపం, అంతరాళం వంటి వున్న యీ ఆలయం ఏడు అంతస్తుల రాజగోపురంతో విరాజిల్లుతున్నది. చాముండీశ్వరికి చామాయీ అని ముద్దు పేరు. మైసూర్ మహారాజుల కులదైవం చాముండీశ్వరి దేవి. ఈ ఆలయంలోని ఏకశిల నంది, మహిషాసురుని శిల ప్రపంచ ప్రసిధ్ధి చెందినవి. దుర్మార్గాన్ని అణిచి ధర్మాన్ని నిలిపిన దేవిని పూజించి శుభాలు పొందుదాము.