YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

క్షయ వ్యాధికి ఉల్లి మంచి ఔషధం...

క్షయ వ్యాధికి ఉల్లి మంచి ఔషధం...

- యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియా పనిపట్టే ఉల్లి.. 

- భారత సంతతి శాస్త్రవేత్త పరిశోధన 

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది ఓ సామెత. ఆ సామెతలో ఎంత నిజముందో తెలియదు గానీ, మందులకు లొంగని క్షయ (టీబీ)కు మాత్రం చెక్ పెడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. క్షయ విషయంలో ఎన్ని యాంటీ బయాటిక్‌లను వాడినా.. వాటికి రోగనిరోధకతను సంతరించుకుంటూ రోగులను మరింత నిర్వీర్యం చేసేస్తోంది టీబీ. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త సంజీవ్ భక్త నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. క్షయ వ్యాధికి ఉల్లి ఓ ఔషధంగా మంచి ప్రత్యామ్నాయమని చెబుతోంది. క్షయ వ్యాధికి యాంటీ బయాటిక్‌ల చికిత్సతో పాటు ఉల్లిలో ఉండే పలు ఔషధ గుణాలున్న రసాయనాలనిస్తే సత్ఫలితాలనిస్తుందని చెబుతున్నారు. సాధారణంగా టీబీకి ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ సహా నాలుగు రకాల యాంటీబయాటిక్‌లను ఇస్తుంటారు. అలా ఎన్ని యాంటీబయాటిక్‌లు వాడినా.. క్షయ కారక బ్యాక్టీరియా రోగ నిరోధకతను సంతరించుకుంటోంది.

దీంతో లండన్ పరిశోధకులు చేసిన ‘ఉల్లి’ పరిశోధన టీబీ చికిత్సపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పర్షియన్ జాతికి చెందిన ఉల్లిలో క్షయపై పోరాడే రసాయనాలున్నాయని పరిశోధకులు తేల్చారు. ఆ ఉల్లిలోని రసాయనాలను తీసి క్షయ బ్యాక్టీరియాపై పరిశోధనలు చేశారు. ఆ ఔషధ రసాయనానికి ఆ క్షయ బ్యాక్టీరియా లొంగిందని తేల్చారు. 99.9 శాతం మేర ఫలితాలు కనిపించాయని చెబుతున్నారు. కాబట్టి ఈ ఉల్లి రసాయనం ఆధారంగా టీబీకి సరికొత్త మందును కనుగొనేందుకు దారులు ఏర్పడ్డాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘క్షయ వ్యాప్తి నిరోధానికి అంతర్జాతీయ సమాజం ఎంత కృషి చేస్తున్నా దానికి తగిన ఫలితాలు మాత్రం కనిపించట్లేదు. ఏటా కోటికిపైగా కొత్త కేసులు తెరపైకి వస్తు్న్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో 5 కోట్ల మందికిపైగా క్షయతో బాధపడుతున్నారు. ఒక్క 2016లోనే 2 కోట్ల మందికిపైగా క్షయ కారణంగా చనిపోతున్నారు’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన సంజీవ్ భక్త తెలిపారు. కాబట్టి మందులకు లొంగకుండా నిరోధకతను సంతరించుకుంటున్న క్షయ బ్యాక్టీరియా పనిపట్టే ఔషధాన్ని తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఉల్లిలో ఉండే ఔషధ గుణాల రసాయనాలు క్షయ వ్యాధికి వాడే యాంటీ బయాటిక్ ప్రభావాన్ని పెంచుతుందని, తద్వారా చికిత్సలో మంచి ఫలితాలు వస్తాయని ఆయన విశదీకరించారు. 

Related Posts