మిస్ సింగపూర్ గా సిక్కోలు నందిత
శ్రీకాకుళం, సెప్టెంబర్ 18,
సిక్కోలు అమ్మాయికి సింగపూర్ కిరీటం దక్కింది. 21 ఏళ్ల బాన్న నందిత మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటం గెలుచుకున్నారు. ఆరునెలలుగా వివిధ అంశాల్లో జరిగిన పోటీల తర్వాత ఆరుగురిని తుది దశకు ఎంపిక చేశారు. అందులో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలిచ్చిన నందితకు టైటిల్ దక్కింది. తొలి నుంచీ మోడలింగ్ అంటే ఇష్టం కావడంతో మిస్ యూనివర్స్ సింగపూర్ పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్నారు.నందిత స్వస్థలం శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారులోని దూదివారి వీధి. ఇక్కడే సొంతిల్లు ఉంది. తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి 25 ఏళ్ల కిందట సింగపూర్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరూ సివిల్ ఇంజినీర్లు.. ప్రస్తుతం గోవర్ధనరావు ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. తల్లి మాధురి కూడా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆమె సోదరుడు హర్ష సౌరవ్ కెనడాలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా చేసి రిటైరైన డాక్టర్ బాన్న సంజీవరావు నందితకు చిన తాత. దంత వైద్యులు బాన్న త్రినాథరావు పెదనాన్న.నందిత ఫ్యాషన్ పోటీలకు కూడా పాల్గొన్నారు. చదువులోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. నందిత ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కంప్యూటర్ సైన్స్‌లో డ్యూయల్ డిగ్రీ చదువుతున్నారు. మిస్ యూనివర్స్ సింగపూర్‌గా కిరీటాన్ని దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు నందిత. డిసెంబర్‌లో ఇజ్రాయిల్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు హాజరవుతానని తెలిపారు. సింగపూర్ తరఫున ఈ పోటీల్లో పాల్గొంటానని చెప్పుకొచ్చారు. చదువుతో పాటు మోడలింగ్ తనకు చాలా ఇష్టమన్నారు.