YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుట్రపూరిత సిద్ధాంతాలను అమలు చేస్తోన్న మోడీ సర్కార్ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్

కుట్రపూరిత సిద్ధాంతాలను అమలు చేస్తోన్న మోడీ సర్కార్               మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్

కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీల విమర్శనాస్త్రాలు పదును తేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా కుట్రపూరిత సిద్ధాంతాలను అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. బెంగళూరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ సర్కారు రెండు ఘోర తప్పిదాలు చేసిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. అందులో ఒకటి పెద్ద నోట్ల రద్దు చర్యను పేర్కొన్నారు. రెండో తప్పుగా జీఎస్టీని తొందరపాటుగా అమలు చేయడమని తెలిపారు. ఈ రెండు తప్పుల ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని ప్రముఖ ఆర్థిక వేత్త కూడా అయిన మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.ఈ చర్యలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై ప్రభావం పడి, వేలాది ఉద్యోగాలు పోయినట్టు చెప్పారు. మోదీ సర్కారు ఆర్థిక నిర్వహణ తీరు కారణంగా ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం క్రమంగా తుడిచిపెట్టుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరత సమస్య నివారించతగినదేనని చెప్పారు. ‘అధిక మొత్తాల్లో పన్నులు విధించి ప్రజల మీద మోయలేని భారం మోపుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశం మంచి వృద్ధి రేటుతో దూసుకెళ్లింది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుసరిస్తోన్న ఘోరమైన ఆర్థిక విధానాల వల్ల అది సగానికి పడిపోయింది. పెరిగిపోతున్న బ్యాంకింగ్ నేరాలు ఆ రంగం మీద ప్రజలకు నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

Related Posts