20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసిన సోనూ సూద్
న్యూఢిల్లీ సెప్టెంబర్ 18
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంట్లో వరుసగా మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. అయితే నటుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయపన్నును ఎగవేసినట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు సమీకరించినట్లు ఐటీశాఖ చెప్పింది. నటుడికి సంబంధించిన ఇండ్లు, అతని అసోసియేట్స్ ఇండ్లు, ఆఫీసుల్లో నిర్వహించిన తనికీలు పన్ను ఎగవేతకు చెందిన అనేక పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ తెలిపింది.కరోనా మహమ్మారి వేళ హీరో సోనూ సూద్ తన విరాళాలతో ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్ సంస్థను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ 20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మరో 17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి.బుధవారం రాత్రి అతని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. గురువారం ఉదయాన్నే ఇంటికి చేరుకున్నారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ సూద్‌కు ఉన్న ప్రాపర్టీ డీల్‌పై పన్ను అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. బుధవారం ఆరు చోట్ల సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లక్నో రియల్ ఎస్టేట్ కంపనీతో జరిపిన డీల్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ డీల్‌లో పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సర్వే జరపాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ వర్గాలు వెల్లడించాయి.ఈ ఆపరేషన్‌ను సర్వేగా వాళ్లు పిలుస్తున్నారు. అయితే రాజకీయ కక్షతోనే సోనూ సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కొవిడ్ సందర్భంగా చేసిన దాతృత్వ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా సోనూ పేరు మార్మోగిన విషయం తెలిసిందే. అయితే అతడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి, దేశ్ కా మెంటార్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సోనూపై ఇలా ఐటీ దాడుల జరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.