హిమాలయ పర్వత శ్రేణులలో ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లే భూతలస్వర్గం కులు మనాలి లోయలు. ప్రసిధ్ధి చెందిన విహారయాత్రా కేంద్రం. దేవతలు నివసించే స్ధలం అని కూడి అంటారు. అతి శీతలమైన ఈ ఊరి బస్ స్టాండ్ కి సమీపమున శ్రీరామునికి అందమైన ఆలయం ఒకటి వున్నది. ఈ ఆలయంలో శ్రీరాముడు రఘునాధ్ జీ అనే పేరు తో కొలువై వున్నాడు కొన్ని శతాబ్దాల క్రితం యీ ప్రాంతాన్ని జగత్ సింగ్ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజుగారు ప్రతి సంవత్సరం 'మణికర్ణ' అనే ప్రాంతానికి విశ్రాంతి కై వెళ్ళేవాడు. ఆ ప్రాంతంలో నివసించే బ్రాహ్మణుడు తన కుటీరం లో యాగాలు, హోమాలు చేస్తూ వుండేవాడు. ఆ బ్రాహ్మణుడు అనేక విలువైన ముత్యాలను సేకరించాడు. కాని వాటి ద్వారా ధనవంతుడు కావాలని ఆశించక పేదరికంతోనే జీవించాడు. ఒకనాడు ఆ మార్గం గుండా వెడుతున్న రాజ భటులు ఆ బ్రాహ్మణుని కుటీరంలోని అతి విలువైన ముత్యాలు చూసి ఆశ్చర్య పోయారు. తక్షణమే రాజుగారికి ఆ విషయం తెలిపారు. ఆశ్చర్యపోయిన రాజు దురాశాపరుడై వెంటనే ఆ ముత్యాలన్నీ తన కోశాగారానికి తరలించమని తన భటులను ఆజ్ఞాపించాడు. వేగంగా వెళ్ళిన రాజభటులు ఆ పేద బ్రాహ్మణుని ముత్యాలు యివ్వమని అడిగారు. కానీ ఆబ్రాహ్మణుడు ఇవ్వడానికి నిరాకరించడంతో అతనిని దారుణంగా హింససించి రాజభటులు ఆ విలువైన ముత్యాలను అపహరించి రాజుకు అందజేశారు. ఏ విధమైన ప్రలోభాలు లేని ఆ బ్రాహ్మణునికి తీరని వేదన కలిగింది. ముత్యాలు అపహరించుకుని తీసుకుపోయిన మహారాజు మీద ఆవేశంతో పగ తీర్చుకోవాలని పెద్ద యాగ గుండం ఏర్పరిచాడు. ఏకబిగిన ఊపిరిబిగించి మంత్రోఛ్ఛాటనలు చేసి ఆఖరున తానే యాగ జ్వాలలకి బలి అయ్యాడు. ఆ మరుక్షణమ తన రాజ భవనంలో భోజనం చేస్తున్న మహారాజు ఆహారమంతా రక్తమయం అయినది. అదిరిపోయాడు రాజు. ఆ భయం నుండి తేరుకునే లోపున అతని శరీరం ,దుస్తులన్నీ రక్తమయం అయినవి. అప్పుడు ఒక అశరీర వాణి 'ముత్యాలు కావాలా? ముత్యాలు కావాలా? అని వికటాట్టహాసం చేసింది. రాజు ఎక్కడకి వెళ్ళినా ముత్యాలు కావాలా ? అని అశరీరవాణి వినిపించసాగింది. మహారాజుని తరిమి తరిమి అశరీరవాణి వినిపిస్తూనే వున్నది. మహారాజు భయకంపితుడై రాజద్వారం వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. తన జ్ఞానదృష్టి తో అంతా తెలుసుకున్న రాజ గురువు తన కమండలం నుండి నీరు తీసుకుని మహారాజు ముఖం మీద జల్లారు. స్పృహ రాగానే గురువుని చూసిన మహారాజు కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే రాజుని చూసి, " నీవు ఒక సద్బ్రాహ్మణుని నిష్కారణంగా హింసించి నాశనం చేశావు. ఆ బ్రాహ్మణుని శాపం నిన్ను వదలదు. నీవు చేసిన పాపానికి పరిహారంగా అయోధ్యకు వెళ్ళి అక్కడనుండి రఘునాధుని విగ్రహాన్ని తీసుకుని వచ్చి నీ కోట భవనానికి సమీపమున చక్కటి ఆలయం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్టించి పూజలు చేస్తే నీ శాపం తొలగి పోతుంది " అని ఉపదేశించాడు. అదేవిధంగా మహారాజు అయోధ్యకి వెళ్ళి బ్రొటనవ్రేలంత పొడుగున్న రాముడి విగ్రహన్ని తీసుకు వచ్చి ఆలయంలో ప్రతిష్టించి పూజించగా శాపం తొలగినదని స్థలచరిత్ర తెలుపుతున్నది. రాజభవనానికి దగ్గర వున్న ఆ ఆలయం రఘునాధ్ జీ మందిర్ అని పిలువబడుతున్నది. శ్రీరాముడు రావణుని గెలవడానికి ముందు దుర్గాదేవిని పూజించిన తొమ్మిది రోజులే నవరాత్రులు అని ఐహీకం. ఉత్తర దేశంలో నవరాత్రి ఉత్సవాలు పది రోజులపాటు జరుపుతారు. ఉత్సవాల ఆఖరి రోజన వ్యాసనది ఒడ్డుకి రఘునాధ్ జీ ని ఒక అందమైన రధంలో తీసుకువస్తారు. అప్పుడు అక్కడ రావణ వధ అనే దృశ్యాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాల సమయం లో కులూ మనలి చుట్టు ప్రక్కల వున్న గ్రామాల నుండి 200 మంది దేవతామూర్తులను మేళ తాళాలతో పల్లకీలలో ఊరేగింపుగా తీసుకు వస్తారు. ఆ సమయంలో వేలాది భక్తులు రఘునాధ్ జీ దర్శనం చేసుకుంటారు. ఉత్సవాలు సంపూర్ణ మవగానే రాజవంశీకులు రఘునాధ్ జీని తమ రాజభవనానికి తీసుకువెళ్ళి ఒకరోజు పూర్తిగా రాజ భవనంలో ఆరాధించి మరునాడు ఆలయంలో అప్పగిస్తారు. ఆ సమయంలో భక్తుల ఉత్సాహం, ఆనందం వర్ణింప శక్యంకాదు.