మనిషికి శత్రువులుగా ఆరు గుణాలను చెప్పారు. అవే- కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలు! వాటినే శత్రువర్గంగా పేర్కొంటూ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనావళిని హెచ్చరించారు పండితులు! ఈ ఆరు గుణాలలో ఏ ఒక్కదాని ఉనికి ఎక్కువగా ఉన్నా మనిషి బతుకు దుర్భరమవుతుంది. ఈ అన్ని దుర్గుణాలూ ఒకే వ్యక్తిలో ఉండకపోవచ్చు. అరిషడ్వర్గాలుగా పిలిచే ఈ ఆరు అంశాలు ప్రమాదకరమైనప్పటికీ- కామం, క్రోధం విషయంలో మరీ మరీ అప్రమత్తత అవసరం అన్నది అనుభవజ్ఞుల అభిప్రాయం!
కామం ఏ జీవికైనా ఉండే సహజ లక్షణం. అది మితిమీరినప్పుడు మనిషి బతుకు దుర్భరమవుతుంది. అశాంతి ప్రబలుతుంది. మనిషి చిత్తశాంతికి దూరమవుతాడు. అధర్మయుత కామావలంబన ద్వారా మహా పండితుడైన రావణుడు సైతం నశించాడు.
మహాదేవుడిలో కామాగ్ని ప్రేరేపణ చేసిన కామదేవుడు మన్మథుడు ముక్కంటి చూపునకు భస్మమైన ఉదంతం మనకు తెలుసు. మానవుడు కామపరంగా ఎంత అదుపులో ఉండాలో సంఘజీవితంలో ఆ అంశం ఎంత ప్రాధాన్యం కలిగి ఉందో మనిషి విజ్ఞతతో తెలుసుకొని ప్రవర్తించాలి.
కామం తరవాత అంతటి ప్రమాదకారి క్రోధం! క్రోధాన్ని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మరీ మరీ హెచ్చరించాడు. కోపానికి వశమైనప్పుడు మనిషి ఎలాంటి వికారాలు పొందుతాడు? శారీరకంగా, మానసికంగా అతడిలో ఎలాంటి విపరిణామాలు సంభవించి చివరకు భ్రష్టుడవుతాడు? వాటిపై భగవానుడు చక్కగా హెచ్చ రించాడు. సంకల్ప మాత్రంగా, సంకల్ప బలం చేత ఎలాంటి సంకట స్థితినైనా మానవుడు నియంత్రించవచ్చు.
విపరిణామాలు సంభవించగల దుర్భర స్థితిలోనూ మనిషి ఆత్మబలం ప్రదర్శించి అజేయుడు కావచ్చు. కామవి కారానికి లోను కావడం, క్రోధావేశానికి గురికావడం మనిషిని చావుదెబ్బ తీస్తాయి.
లోభ మోహ మద మాత్సర్యాలు పతనావస్థకు దారితీసేవే అయినా విజ్ఞత ప్రదర్శించి వాటిని అధిగ మించవచ్చు. కామ క్రోధాలు మనిషి విజ్ఞతను సైతం హరించివేస్తాయన్నది పండితుల భావన!
అనుకున్నది అనుకున్నట్లు జరగనప్పుడు మనిషిని కోపం ఆవహిస్తుంది. ఓ అధికారికి కోపం వస్తే సహాయకుడు భయపడతాడు. ప్రభువుకు కోపం వస్తే పౌరుడు భీతిల్లుతాడు. ఓ దుర్జనుడి కోపం వల్ల సమాజానికి చేటు కలుగుతుంది. అవినీతి పట్ల ఓ మహారాజు ఆగ్రహిస్తే అక్రమార్కులు నశించి సుహృద్భావ వాతావరణం వెల్లివిరియవచ్చు.అనువుగాని చోట సామాన్యుడు ప్రదర్శించే కోపం వల్ల అరిష్టం కలుగుతుంది. వివేకవంతుడి కినుక సమాజ హితం కలిగించవచ్చు. ఎవరి స్థాయి ఏదైనా మనశ్శరీరాలపై దుష్ప్రభావం పడుతుంది. కొందరు కారణం లేకుండానే ఆగ్రహం ప్రదర్శిస్తారు. కోపాన్ని కేవలం అనంగీకారాన్ని సూచించే దేహభాషగా పరిమితం చేసుకుంటే, పాము విషం ఔషధ రూపంలో మేలు చేసినట్లు ప్రయోజనం దక్కుతుంది.
ప్రేమ మహత్తరమైనది. ఎల్లలు లేనిది. ప్రేమ ద్వారా కోపాన్ని, విజ్ఞత ద్వారా కామాన్ని జయించవచ్చు. మితాహార మితవ్యయాల్లా కామ క్రోధాలను అదుపులో ఉంచుకున్నవాడు లోకపూజ్యత పొందుతాడు. హృదయంలో ప్రేమ(భక్తి) బీజం నాటి వికారాలను నిర్వీర్యం చేసుకోవాలి.
సాధనా పరంగా విజయుడైన మానవుడికి శాంతి, ఆనందం కరతలామలకమే!