YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

11 మందికి ఎదురీతేనా

11 మందికి ఎదురీతేనా

విజయవాడ, సెప్టెంబర్ 20, 
ఆంధ్రప్రదేశ్ లో జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. మ‌రో మూడు నెల‌ల త‌ర్వాత అంటే ద‌స‌రాకు కాస్త అటూ ఇటూగా జ‌గ‌న్ త‌న కేబినెట్లో భారీ ప్రక్షాళ‌న‌కు రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ కేబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. ఈ మంత్రుల ప‌నితీరుపై జ‌గ‌న్ ఇప్పటికే మూడు నాలుగు నివేదిక‌లు కూడా తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.వీరిలో ఎవ‌రు ఉంటారో ? ఎవ‌రు అవుట్ అవుతారో కాని.. వైసీపీ వ‌ర్గాల్లోనూ, మీడియాలోనూ జ‌రుగుతోన్న ప్రచారం ప్రకారం 11 మంది మంత్రుల‌ను ఖ‌చ్చితంగా త‌ప్పిస్తార‌ని అంటున్నారు. ఈ లిస్టులో వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, సుచ‌రిత‌, తానేటి వ‌నిత‌, పుష్పశ్రీ‌, రంగ‌నాధ‌రాజు, జ‌య‌రాం, శంక‌ర‌నారాయ‌ణ‌, అనిల్ కుమార్ యాద‌వ్, నారాయ‌ణ స్వామి, విశ్వరూప్, అవంతి శ్రీ‌నివాస్ ఉన్నారు.ఈ మంత్రుల‌ను త‌ప్పించే క్రమంలో కొంద‌రు విష‌యంలో ప‌నితీరును ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. మ‌రి కొంద‌రి విష‌యంలో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను కూడా బేస్ చేసుకోనున్నార‌ట‌. పైన చెప్పుకున్న మంత్రుల్లో చాలా మంది మంత్రుల ప‌నితీరు మ‌రీ అధ్వానంగా ఉంద‌ని నివేదిక‌లు జ‌గ‌న్ వ‌ద్దకు చేరిన‌ట్టు తెలుస్తోంది. వెల్లంప‌ల్లి బ‌దులు అన్నా రాంబాబు లేదా కోల‌గ‌ట్లకు ఛాన్స్ ఉండొచ్చు..! జ‌య‌రామ్‌, శంక‌ర్ నారాయ‌ణ ప్లేసులో బీసీ మంత్రులే వ‌స్తారా ? లేదా ఆ జిల్లాల్లో రెడ్డి మంత్రులు ఉంటారా అన్నది చూడాలి.అనిల్ బ‌దులు పార్థసార‌థి పేరుతో పాటు కారుమూరి నాగేశ్వర‌రావు పేరు కూడా లైన్ లో ఉంది. రంగ‌నాథ రాజు బ‌దులు ప్రసాద‌రాజుకు ఛాన్స్ ఖాయం. ఇక న‌లుగురు కాపు మంత్రుల్లో ఖ‌చ్చితంగా ఇద్దరు అవుట్ కానున్నారు. మూడో కాపు మంత్రి కూడా బ‌య‌ట‌కు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు. పుష్ప శ్రీ బ‌దులు రాజ‌న్నదొర లేదా బాల‌రాజుకు ఛాన్స్ ఖాయం. ఏదేమైనా ఎక్కువ మంది మంత్రుల ప‌నితీరుపై జ‌గ‌న్ సంతృప్తితో లేరు.
ముందస్తుకు నో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? ఆ ఆలోచన చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ విజయం సాధ్యమేనా? ఇదీ ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చ. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఎలాంటి అవకాశాలు కన్పించడం లేదు. జగన్ ఇప్పుడు ఏపీలో బలంగా ఉన్నారు. విపక్షాలు వీక్ గా ఉన్నాయి. సంక్షేమ పథకాలతో జనం మద్దతును కోరే ప్రయత్నం జగన్ తొలి నుంచి చేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో కుటుంబాలను పథకాలతో తన పరం చేసుకోగలిగారు.ఇంకా జగన్ చేయాల్సి చాలా ఉంది. ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా చేసి చూపెట్టాల్సి ఉంది. దీంతో పాటు మూడు రాజధానుల అంశాన్ని కూడా తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగకుండా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తారా? అన్నది ప్రశ్న. జగన్ కు గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఏపీలో బలంగా నిలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాదనుకుని ముందస్తు ఎన్నికలకు వెళితే చేతకానితనంగా భావించారా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది.నిజానికి జగన్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొలి నుంచి ప్రయత్నం మొదలు పెట్టారు. సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేసి తర్వాత మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ అనుకోకుండా కరోనా రావడం దాదాపు రెండేళ్లు కరోనాతోనే సమయం గడిచిపోవడంతో అనుకున్న పనులను పూర్తి చేయలేకపోయారు. ఇటు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉంది.
జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పేదలకు ఇంటిస్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా సమయం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత వెనక్కు లాగుతున్నాయి. అందుకే జగన్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో గ్రౌండ్ అయిన తర్వాతనే ముందస్తు ఎన్నికలకు వెళతారంటున్నారు.

Related Posts