గుంటూరు సెప్టెంబర్ 20,
నిజానికి.. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు అందరూ తమ తమ నియోజకవర్గాల్లో ఉంటూ. పనులు చేస్తున్నారు. కొందరు మౌనంగా ఉన్నప్పటికీ.. ఇంటికే పరిమితమైనప్పటికీ.. సొంత పనుల్లో మునిగి తేలుతున్నారు. మొత్తంగా తమ తమ నియోజకవర్గాలపై అయితే, అంతో ఇంతో ప్రేమను కురిపిస్తున్నారు. కానీ, ఎటొచ్చీ.. హోం మంత్రి మేకతోటి సుచరిత విషయంలోనే వ్యతిరేకత వస్తోందని అంటున్నారు నియోజకవర్గంలోని పరిశీలకులు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజవకర్గం నుంచి విజయం సాధించిన సుచరిత.. దాదాపు నియోజకవర్గానికి చాలా దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటికి కేవలం రెండు మూడు సార్లు మాత్రమే నియోజకవర్గంలో కనిపించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. గత ఏడాది ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరిస్తామంటూ.. సుచరిత హామీ ఇచ్చారు. కానీ, ఏడాదిన్నర అయినా.. ఆమె ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టింది లేదు. పైగా.. నియోజకవర్గానికి కూడా వెళ్లడం మానేశారని అంటున్నారు. ఎంతసేపూ.. గుంటూరులోని అరండల్ పేటలో ఉన్న ఇంటికే పరిమితమవుతున్నారని, దీంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కేవలం స్థానిక నేతలతో మాత్రమే అప్పుడప్పుడు టచ్‌లో ఉంటోన్న సుచరిత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడమే మానేశారని అంటున్నారు. కరోనా టైంలోనే కాదు.. అంతకు ముందు కూడా ఆమె నియోజకవర్గ ప్రజలు మొఖం చూపించలేదు. నిమోజకవర్గంలో అనేక గ్రామాల్లో రహదారులు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి. చివరకు నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోనే రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గుంటూరు రూరల్ మండలంలో చాలా గ్రామాల్లో రహదారులు, మంచినీళ్లు లేవు. హోం మంత్రిగా ఉండడంతో నేరుగా మంత్రిని కలిసే అవకాశం కూడా తమకు కలగడం లేదని, నియోజకవర్గంలోకి అడుగు కూడా ఆమె పెట్టడం లేదని, దీంతో తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక పోతున్నామని ఇక్కడి వారు వాపోతున్నారు.ఇక, తనకు ఇక్కడ తిరుగులేదని మంత్రి సుచరిత భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా టీడీపీకి ఇక్కడ నాయకుడే లేకపోవడం, పార్టీ జెండా మోసే నేత కూడా లేకపోవడం సుచరిత ధీమాకు కారణంగా కనిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసి బీజేపీలో చేరిన రావెల కిశోర్‌బాబును కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం లేదు. ఇక ఇక్కడ టీడీపీకి ఎవ్వరూ నాయకుడు లేకపోవడంతో చివరకు చంద్రబాబు అవుట్ డేటెడ్ లీడర్ అయిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను పార్టీ బాగోగులను చూడాలని ఆదేశించారు. గతంలో టీడీపీని వీడి పలు పార్టీలు మారి తిరిగి టీడీపీలోకి వచ్చిన రత్తయ్యను కేడర్ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతోనే సుచరిత రాజకీయంగా తనకు తిరుగులేని భావిస్తున్నారట. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ప్రత్తిపాడులో సుచరితకు వ్యతిరేక గాలులు వీచే సమయం దగ్గర్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది.