హైదరాబాద్, సెప్టెంబర్ 20,
టాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం రేపింది. 2017లో అనేక మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్ శాఖ విచారించింది. ఇప్పుడు వారందరిలో 12 మందకి క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాధ్, రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్, తనిష్, నవదీప్, తరుణ్ వంటి వారిని గంటలు గంటలు విచారించింది. వీరందరి రక్తం, గోళ్లు వంటి వాటిని సేకరించింది. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని అప్పట్లో ఎక్సైజ్ శాఖ పేర్కొంది కూడా.అయితే ఇప్పుడు 12 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇవ్వడం రాజకీయ రంగు పులుముకుంది. కోర్టులో దాఖలు చేసిన అఫడవిట్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారెవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదని కోర్టులో వేసిన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఇన్నేళ్ల తర్వాత నివేదికను బయటపెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నిజానికి గత ఏడాది డిసెంబరులో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిందన్నారు. పదినెలల తర్వాత దీనిని బయటపెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్ విషయంలో మాత్రం ఎక్సైజ్ శాఖ పక్కాగా ఉంది. కెల్విన్ నిందితుడనే పేర్కొంటుంది. ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు డ్రగ్స్ కేసు విచారణ చేపట్టడంతో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను కావాలని బయటపెట్టారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. సినీ సెలబ్రటీలకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇది రాజకీయంగా విమర్శలకు కూడా తావిచ్చింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మొదలయింది.సినిమా సెలబ్రిటీలతో రోజూ తిరిగేది కేటీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇలా టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా సంచలనం రేపుతుంది. కావాలనే సినీ ప్రముఖులను కేసు నుంచి తప్పించారని విపక్ష పార్టీలు ఆరోపిస్తు న్నాయి. అయితే ఇంత హడావిడి ఎందుకు చేసినట్లు? వారి వద్ద సరైన ఆధారం లేకపోతే ఎందుకు ఇంత డ్రామా చేసినట్లు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద టాలీవుడ్ డ్రగ్స్ కేసు అటకెక్కినట్లే. సినిమా మాదిరిగానే దీని కథ కూడా సుఖాంతమయింది.