హైదరాబాద్, సెప్టెంబర్ 20,
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కారు మళ్లీ ఔట్ సోర్సింగ్ పద్ధతినే ఎంచుకున్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ల మాటెత్తడం లేదు. రెగ్యులర్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే వివిధ డిపార్ట్‌మెంట్లలో ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు మొదలయ్యాయి. జూనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ లెక్చరర్ దాకా ఇట్లనే రిక్రూట్ చేస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ డిపార్ట్మెంట్, మైనార్టీ, బీసీ గురుకులాల్లో ఈ ప్రాసెస్ నడుస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలుండవని, ఖాళీలన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి పెద్దగా రెగ్యులర్ పోస్టుల భర్తీ లేదని, రెండు మూడేండ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తొమ్మిది నెలల కింద సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి చాలా మంది నిరుద్యోగులు వేలకు వేలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు.అయితే, నోటిఫికేషన్లు వేయకపోగా.. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తుండడంతో వాళ్లు ఇప్పుడు కోచింగ్ సెంటర్లను ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోతున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలను ఎక్కువగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే నింపుతున్నారు. ఇటీవల 1,500 పోస్టుల వరకు ఇట్లనే భర్తీ చేశారు. వీరిలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్ ఉన్నారు. ఈ శాఖలో ఏండ్ల తరబడిగా రెగ్యులర్ పోస్టుల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కరోనా టైంలో 1,600 మందిని అత్యవసరంగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకున్న ప్రభుత్వం.. కరోనా తగ్గుముఖం పట్టగానే తొలగించి రోడ్డున పడేసింది. మైనార్టీ గురుకులాల్లోని జూనియర్ కాలేజీల్లో 925 లెక్చరర్ పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను జులై 27న విడుదల చేశారు. 111 జూనియర్ కాలేజీల్లో 840 ఖాళీలు, 12 ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 పోస్టులను నింపుతున్నారు. ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు సబ్జెక్టుల్లో 111, మ్యాథ్స్‌లో 80, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో 63,హిస్టరీలో 31, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్‌లో 48 చొప్పున వేకెన్సీలు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తోంది. బీసీ గురుకులాల్లో కొత్తగా వెయ్యి ఉద్యోగాలు ప్రభుత్వం మంజూరు చేసింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 119 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసింది. దీంతో 2021– 22 విద్యా సంవత్సరంలో వీటిని ప్రారంభించారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో 850 టీచింగ్ పోస్టులు, 150 వరకు నాన్ టీచింగ్ పోస్టులను నింపనుంది. వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ఎంప్లాయీస్ పద్ధతిలో నియమించనుంది. ఇందుకోసం అప్లికేషన్లు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన చేసి 9 నెలలవుతున్నా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మూడేండ్లుగా జాబ్ నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఏజ్ బార్ అవ్వగా, మరికొందరు ఏజ్ బార్కు దగ్గర్లో ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రులు, లీడర్లు చెప్తున్నా.. ఒక్క నోటిఫికేషన్ రాలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ మంత్రులు ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఏండ్ల తరబడి కొలువులు లేక ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. ఈసారి ఎట్లయినా కొలువు కొట్టాలనే పట్టుదలతో ప్రిపరేషన్ మొదలుపెట్టారు. హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టి చేరారు. నోటిఫికేషన్లు వేయకపోవడం, ఔట్ సోర్సింగ్ పద్ధతిని అనుసరిస్తుండటంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్లు వేసే పరిస్థితి కనిపించడంలేదని అనేక మంది మళ్లీ సొంతూర్లకు వెళ్లిపోతున్నారు.