YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పధకాలకు డబ్బులు ఎట్లా...

 పధకాలకు డబ్బులు ఎట్లా...

హైదరాబాద్, సెప్టెంబర్  20, 
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, హామీలకు డబ్బులు  సర్దలేక ఆర్థిక శాఖ సతమతమవుతోంది. ఖజానాపై భారం పెరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నానా తంటా లు పడుతూ ఏ నెలకానెల నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే బిల్లులు, స్కీముల బకాయిలు భారీగా పేరుకుపోవటంతో ఉద్యోగుల జీతాల చెల్లింపులకే అప్పులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖర్చులు ఆదాయాన్ని మించుతున్న తీరు చూస్తే ఆర్థిక నిర్వహణ గాడి తప్పుతున్నదనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే రైతుల పంట రుణాల మాఫీకి ఏకమొత్తంలో నిధులు చెల్లించే పరిస్థితి లేదని ఆఫీసర్లు అంటున్నారు. వాసాలమర్రి, హుజూరాబాద్ తర్వాత ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు మండలాలకు దళిత బంధు ప్రకటించింది. దీనికి అవసరమైన సుమారు రూ.900 కోట్లను సమకూర్చడం తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు.రైతుల పంట రుణాల మాఫీకి మూడేండ్లయినా ప్రభుత్వం తగిన నిధులు రిలీజ్ చేయలేకపోయింది. దీంతో ఏటేటా పెరుగుతున్న వడ్డీల భారంతో రైతులకు నష్టం జరిగినట్లయింది. లక్ష రూపాయల దాకా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.31 వేలలోపు రుణాలనే మాఫీ చేసింది. రుణమాఫీకి రూ.25 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే కేవలం రూ.732 కోట్లు ఖర్చు చేసింది. నిధుల కటకటతో ఏటేటా రుణమాఫీ నిధులు ఇవ్వకుండా దాటేస్తూ వస్తోంది. మిత్తీ మీద మిత్తీ లెక్కలతో రూ.3,200 కోట్ల వడ్డీల భారం రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఈ భారాన్ని రైతులే భరించాలని బ్యాంకర్లు అంటున్నారు. దాదాపు 32 లక్షల మంది రైతులపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని అంచనా. మూడేండ్లలో బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రుణమాఫీకి ప్రభుత్వం రూ.17,225 కోట్లు కేటాయించినా.. ఇప్పటికీ వెయ్యి కోట్లు ఇవ్వలేకపోయింది. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి స్కీము కేటాయింపులు, నిధుల ఖర్చు అద్దం పడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నరు.హుజూరాబాద్ బై ఎలక్షన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొత్తగా ప్రకటించిన దళితబంధుకు నిధుల సర్దుబాటు ఆర్థిక శాఖకు కత్తిమీద సాములా మారింది. ఈ ఏడాది బడ్జెట్లో ఎస్సీ ఎంపవర్మెంట్పేరుతో ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఒక్క హుజురాబాద్కే ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయాలనే ఆదేశాలతో ఆర్థిక శాఖ వర్గాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. మరో నాలుగు మండలాలు, సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ స్కీము అమలుకు మరో రూ.వెయ్యి కోట్లు కావాలన్నది ఆఫీసర్ల అంచనా. ఈ  మూడు వేల కోట్లను అప్పులతో పాటు  ఇతర స్కీముల పద్దుల నుంచి అడ్జస్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ స్కీమును రాష్ట్రమంతా అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఖజానాకు భారమవుతుందని,  వచ్చే బడ్జెట్నూ ప్రభావితం చేస్తుందని ఆఫీసర్లు అంటున్నారు. దళితబంధుకు ఏటా రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించడం తెలిసిందే. రుణమాఫీకి రూ.23 వేల కోట్లే ఇచ్చే పరిస్థితి లేనప్పుడు దళితబంధుకు ఇంత భారీ  కేటాయింపులు సాధ్యం కాదని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు.ఇటీవలి లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు  వరకు రాష్ట్ర మొత్తం రాబడి రూ.66,000 కోట్లు కాగా అందులో రూ.20,400 కోట్లు అప్పులే! సగటున నెలకు రూ.4 వేల కోట్ల అప్పులు తెస్తేనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ కష్టంగా సాగుతోంది. ప్రతినెలా జీతాలకు రూ.2,500 కోట్లతో పాటు అప్పుల కిస్తీలు, వడ్డీలకు రూ.3,500 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. పాత అప్పుల వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు తేవాల్సిన పరిస్థితి! ఇలాంటి టైమ్లో భారీ అంచనాలతో తెస్తున్న స్కీములకు కావాల్సిన పైసలు ఎక్కణ్నుంచి తెస్తారని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Related Posts